Arya: ఆ సినిమా తప్ప ఇంకోటి లేదు.. కెప్టెన్ కూడా అలా కావాలి.. ఆర్య ఆసక్తికర విషయాలు
అల్లు అర్జున్ సినిమా వరుడుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కోలీవుడ్ హీరో ఆర్య. ఆ తర్వాత రాజా రాణి చిత్రంతో తమిళంతోపాటు తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్నాడు. అప్పుడప్పుడు తన సినిమాలను తెలుగులోనూ డబ్ చేస్తూ పలకరిస్తుంటాడు. ఇటీవలే ఎనిమీతో వచ్చిన ఆర్య తాజాగా కెప్టెన్‌గా రానున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ, సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్య పంచుకున్న విశేషాలు ఇవి.

వేరే డైరెక్టర్ అయితే నో అనేవాన్ని..
శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఇదివరకు నేను 'టెడ్డీ' సినిమా చేశా. ఆ సినిమా తర్వాత 'కెప్టెన్' కథతో ఆయన నా దగ్గరకు వచ్చారు. బహుశా, వేరే దర్శకుడు ఈ కథ చెప్పి ఉంటే నేను చేసేవాడిని కాదేమో. ఇదివరకే శక్తితోపని చేసి ఉండటం, ఆయనకు వీఎఫ్ఎక్స్ మీద అవగాహన ఉండటంతో ఓకే చెప్పాను. ఫస్ట్ ఐడియా విన్నాక.. ఏడాది పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ చేశాం. ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సాధారణంగా ఆర్మీ నేపథ్యం అనగానే.. పాకిస్తాన్ లేదా తీవ్రవాదులతో ఫైట్ ఉంటుంది. కానీ, ఈ సినిమాలో ఒక వింత జీవి ఉంటుంది. దాని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉంది? దాన్ని ఏం చేశాం? అనేది సినిమా.

హాలీవుడ్ మూవీ 'ప్రెడేటర్'లా..
ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత హాలీవుడ్ చిత్రం 'ప్రెడేటర్'లా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, కాదు. ఇది వేరే కథ. ఒక వింత జీవి ఉంది. థియేటర్లలో చూస్తే బావుంటుంది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇలాంటి చిత్రాలు హాలీవుడ్‌లో వచ్చాయి. మన వీఎఫ్ఎక్స్వర్క్‌ను అక్కడి సినిమాలతో పోలుస్తారు. మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఆ స్థాయిలో చేయలేకపోయామని చెప్పలేం. అందుకని, ఆ విషయంలో చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్లు చాలా బాగా చేశారు. నటుడిగా ఛాలెంజింగ్ అంటే.. క్లైమాక్స్ పార్ట్ షూట్ చేయడం! ప్రచార చిత్రాల్లోచూపించినజీవి నటీనటులముందు ఉండదు. కానీ, ఊహించుకుని షూటింగ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే.. భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో సన్నివేశాలు ఉన్నాయి. అవిషూటింగ్ చేయడానికి కష్టపడ్డాను. ఒక్కసారి నీటిలోకి వెళ్ళినతర్వాత ప్రతిసారి పైకి రాలేనుకదా! అందుకని, స్కూబా డైవింగ్ కు ఉపయోగించేఎక్విప్‌మెంట్ మేం ఉపయోగించాం. ఆ మూడు రోజులు కష్టపడ్డాను.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రీచర్ సినిమా..
'కెప్టెన్'లోక్రీచర్ మొత్తాన్ని క్రియేట్ చేయడానికి మేం కొంచెం కష్టపడ్డాం. దర్శకుడుశక్తికివీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా ఎలా షూట్ చేయాలో తెలుసు కాబట్టి... నేను రిస్క్ చేశాను. లేదంటే ముందు చెప్పినట్టు వేరే దర్శకుడు అయితే చేసే వాడిని కాదు. నా దగ్గరకు కథలు వస్తున్నాయి. నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. రిస్కీ స్క్రిప్ట్ ఉన్న దర్శకులువేరే హీరోలు ఎవరూ చేయకపోతే ఆర్య చేస్తాడని నా దగ్గరకు వస్తున్నారు. ఆర్య ప్రొడ్యూస్ కూడా చేస్తాడు. నాతో ఛాన్స్ తీసుకుంటారు. ఆర్మీ సినిమా కాబట్టి ప్రతిదీపర్ఫెక్ట్ గా ఉండాలని అనుకున్నాం. అందుకని, కాస్ట్యూమ్ అన్నీ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ కోసం యూనిఫామ్ కుట్టేవాళ్ళదగ్గర కుట్టించాం. కలర్ నుంచి ఏ విషయంలో తప్పు జారగకూడదని చూశాం. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి షూటింగ్ చేసేటప్పుడు సెట్స్ లో ఉండేలా చూసుకున్నాం. గన్ పట్టుకోవడం నుంచి రన్నింగ్, ఉన్నత అధికారులకుసెల్యూట్ చేసే వరకూ ప్రతి విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం.

ఆ ట్రాక్ కంటిన్యూ అవుతుందని..
నితిన్ నాకు మంచి ఫ్రెండ్. కమల్ హాసన్ గారి 'విక్రమ్'తోభారీ హిట్ అందుకున్నారు. 'కెప్టెన్' ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తుందనినమ్ముతున్నాను. టెడ్డీ' సినిమా చివర్లో టెడ్డీ కన్ను తెరుస్తుంది కదా! అలా ఈ సినిమాలో కూడా సీక్వెల్ చేసే విధంగా చిన్న హింట్ ఇచ్చాం. 'కెప్టెన్' మంచి విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. అవకాశం వస్తే తెలుగులో చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. ఇప్పుడు తెలుగు, తమిళం అని డిఫరెన్స్ లు లేవు. మన దగ్గర కొరియన్ టీవీ సీరియల్స్ కూడా చాలా మంది పిల్లలు చూస్తున్నారు. అందువల్ల, మంచి సినిమా తీస్తే అందరూ చూస్తారు. తెలుగులో 'రాజా రాణి' ఇచ్చినంత గుర్తింపు ఏ సినిమా లేదని చెప్పడంలో మరో సందేహం లేదు. 'కెప్టెన్' కూడా ఆ సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

డ్రీమ్ రోల్ ఏం లేదు..
సిద్ధార్థ్ 'గృహం' తీసిన మిళింద్ రావు దర్శకత్వంలో అమెజాన్ కోసం 'విలేజ్' వెబ్ సిరీస్ చేశా. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావచ్చు. కార్తీహీరోగా 'విరుమాన్' తీసిన ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. కథలు వింటున్నాను. ఓకే అయ్యాక చెబుతా. డ్రీమ్ రోల్ ఏదీలేదు. నా దగ్గరకు వచ్చిన క్యారెక్టర్‌ను పర్‌ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ క్యారెక్టర్‌కు మరొకరు సూట్ అవుతారని అనుకుంటే ఆ విషయం చెబుతాను.


Click it and Unblock the Notifications











