బ్రహ్మానందం హెల్త్‌పై కలవరం వద్దు.. నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది : హీరో గౌతమ్
ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ, డా: బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు. ఆపరేషన్ తర్వాత బ్రహ్మనందం గారి ఆరోగ్యం నిలకడగా ఉంది అని ఓ ప్రకటనలో తెలిపారు. వివారాల్లోకి వెళితే..

ముంబైలో శస్త్ర చికిత్స జరిగింది
తండ్రి బ్రహ్మనందం ఆరోగ్యం గురించి గౌతమ్ చెబుతూ.. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో బ్రహ్మానందం హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు. వైద్యుల సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్‌టిట్యూట్'లో సోమవారం ( 14.1.19 ) నాడు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది అని చెప్పారు.

ఐసీయూ నుంచి బయటకు
ప్రముఖ హృదయ చికిత్స నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా బ్రహ్మానందం గారికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చటం జరిగింది అని తెలిపారు. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యంతో బ్రహ్మండంగా ఉన్నారు అని చెప్పారు.

మీ అభిమానం, ఆశీస్సుల వల్లే
నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని, వారందరికీ ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

బ్రహ్మనందం గురించి సినీ ప్రముఖులు
బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. బ్రహ్మానందం సర్జరీ జరిగిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబాన్ని సంప్రదించినట్టు సమాచారం. ఆయన ఆరోగ్యం గురించి ప్రముఖ నటీనటులు అడిగి తెలుసుకోవడం జరిగిందనే విషయం తెలిసింది.


Click it and Unblock the Notifications











