మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, 41 లక్షల జరిమానా.. కొడుకు సినిమా తెచ్చిన తంటా!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మోహన్ బాబు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు గత కొంత కాలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో వివాదం నెలకొంది. జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన తర్వాత మోహన్ బాబు విమర్శల ఘాటు మరింతగా పెంచారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణు హీరోగా నిర్మించిన సలీం చిత్రం విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సలీం చిత్రం విషయంలో మోహన్ బాబు కోర్టులో కేసు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లోనే ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

సలీం చిత్రం
మంచు విష్ణు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 2009లో సలీం చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో విష్ణుకు జోడిగా ఇలియానా నటించింది. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. సలీం చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనికి తోడు మోహన్ బాబుపై ఈ చిత్ర దర్శకుడు వైవిఎస్ చౌదరి కేసు నమోదు చేశారు.

ఏడాది జైలు శిక్ష
మోహన్ బాబు వైవిఎస్ చౌదరికి ఇచ్చిన రూ 48 లక్షల చెక్ బౌన్స్ అయింది. దీనిపై వైవిఎస్ చౌదరి కోర్టుని ఆశ్రయించారు. 2010లో నమోదైన కేసు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. కాగా తాజాగా హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులు ఏ1గా లక్ష్మీప్రసన్న పిక్చర్స్, ఏ2 గా మోహన్ బాబుని పేర్కొంది. మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష తో పాటు 41 లక్షల జరిమానా విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. మూడు నెలల వ్యవధిలో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

బెయిలుకు ప్రయత్నం
కోర్టు తీర్పు వెల్లడించిన వెంటనే మోహన్ బాబు తరుపున న్యాయవాదులు బెయిలుకు ప్రయత్నిస్తున్నారు. కోర్టు తీర్పుకు సంబంధించి మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. సలీం చిత్రం ఆర్థికంగా నష్టాలని మిగిల్చింది. మోహన్ బాబు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో పలు చిత్రాలని నిర్మించారు.

పొలిటికల్‌గా బిజీ
ప్రస్తుతం మోహన్ బాబు వైసిపి నేతగా రాజకీయంగా బాగా బిజీ అయ్యారు. మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. ఆ మధ్యన మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ విద్యార్థులతో కలసి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఏపీ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











