మోహన్ బాబు ఇంటిపై అగంతకుల దాడి.. కారుతో నివాసంలోకి దూసుకెళ్లి..
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంటిలోకి అగంతకులు దూసుకెళ్లిన ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. శనివారం సాయంత్రం జరిగిన ఘటన సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మోహన్‌బాబు ఇంటిలోకి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తుల ఆయన కుటుంబాన్ని హెచ్చరించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

శనివారం సాయంత్రం
సినీ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. శంషాబాద్‌కు సమీపంలోని జాలపల్లి మోహన్‌బాబు నివాసంలోకి శనివారం సాయంత్రం ఓ ఇన్నోవా కారు దూసుకెళ్లింది. గేట్‌ను ఢీకొట్టి వెళ్లిన కారులోని నుంచి దిగిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ కారులో నలుగురు వ్యక్తులు వచ్చినట్టు తెలుస్తున్నది. దుండగులు వచ్చిన కారు నెంబర్‌ను AP31AN0004 గుర్తించారు. ఆ కారు విజయలక్ష్మి అనే మహిళ పేరుపై రిజిస్టర్ అయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

మిమ్మల్ని వదలమంటూ
మోహన్ బాబు ఇంటిలోకి కారులో దూసుకెళ్లిన నలుగురు వ్యక్తులు ఆయనను, ఆయన కుటుంబాన్ని బెదిరించినట్టు తెలిసింది. మిమల్ని వదలమంటూ దుండగులు హెచ్చరించి తిరిగి వెళ్లినట్టు సమాచారం. అయితే ఈ బెదిరింపులకు వ్యక్తిగత విభేదాలేమైనా కారణమా? లేక పాత గొడవలకు సంబంధించిన కారణాలేమైనా ఉంటాయనే విషయంలో చర్చ జరుగుతున్నది. అయితే మోహన్ బాబు కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా స్పందించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
తమ ఇంటిలోకి వచ్చి అగంతుకులు బెదిరింపులకు పాల్పడినట్టు మోహన్ బాబు కుటుంబ సభ్యులు నగర శివారులోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగంతకుల అచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా అగంతకుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది.
Recommended Video

మోహన్ బాబును హెచ్చరించేంతగా
ఇదిలా ఉండగా, మోహన్‌బాబు ఇంటికెళ్లి హెచ్చరించేంతగా శత్రుత్వం ఎవరికి ఉంటుంది? రాజకీయ, సినీ, వ్యాపారపరంగా పలుకుబడి ఉన్న మోహన్ బాబు లాంటి ప్రముఖుడికి ఆ స్థాయి శత్రువులు ఉన్నది ఎవరు అనే కోణంలో చర్చ మొదలైంది. ఆకతాయిలైనా కావాలనే ఇలా చేశారా? లేదా నిజంగానే మోహన్‌బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పూనుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











