అలాంటి వారిని క్షమించ కూడదు, గాడిదతో సమానం: నాగబాబు
తెలంగాణ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 119 స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల్లో సామాన్యులు, సినీ ప్రముఖులు పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు కాగా... అర్బన్ ప్రాంతాల్లో చాలా మంది ఓటు వేయడానికి దూరంగా ఉండటంతో పోలింగ్ శాతం తక్కుగా నమోదైంది. అయితే ఓటు వేయని వారిపై సినీ నటుడు నాగ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు గాడిదలు అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

ఓటు ఒక వజ్రాయుధం
ఓటు హక్కు రాజ్యాంగ బాధ్యత, రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన హక్కు. ఇది ఒక వజ్రాయుధం లాంటిది. మనకు నచ్చిన పార్టీని ఎన్నుకోవాలన్నా, నచ్చని పార్టీని దింపేయాలన్నా ఓటు ద్వారానే సాధ్యం. దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు నాగబాబు.

అలాంటి వారిని క్షమించకూడదు
ఒంట్లో బాగోలేక, కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారు తప్ప హెల్దీగా ఉండి ఈ రోజును ఒక సెలవు దినంగానో... ఎంజాయ్మెంట్ డేగానో పరిగణించి ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేసిన వారిని అస్సలు క్షమించకూడదని నాగబాబు ఫైర్ అయ్యారు.

వాళ్లు గాడిదలతో సమానం
ఒక కరప్టెడ్ రాజకీయ నాయకుడు, స్కాములు చేసే రాజకీయ నాయకుల కన్నా ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవాడు అంతకంటే దుర్మార్గుడు. నా ఉద్దేశ్యంలో ఓటు వేయనివాడు గాడిదతో సమానం... అని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఓటు వేసిన నాగబాబు
నాగబాబు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగబాబుతో పాటు ఆయన తనయుడు, యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా ఇదే చోట తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Click it and Unblock the Notifications











