ఫేస్‌బుక్ ఫ్రెండుతో పెళ్లి వార్తపై హీరో నాని ఖండన
హైదరాబాద్: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో నాని త్వరలో ఓ ఇండివాడు కాబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో పరిచయమైన విశాఖకు చెందిన అంజన అనే అమ్మాయి ప్రేమలో నాని పడ్డాడనీ, ఆగష్టు 8 న వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నారనీ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను నాని ఖండించారు. ఇవన్నీ ఒట్టి పుకార్లనీ, వీటిని నమ్మద్దనీ అభిమానులకు, శ్రేయోభిలాషులకూ స్పష్టం చేశాడు. వీరిద్దరూ గత మూడేళ్ల నుంచీ ప్రేమలో మునిగి తేలుతున్నారనీ, పెద్దలను ఒప్పించి ఇప్పుడు ఒక్కటవుతున్నారనీ వార్తలొచ్చాయి. దీంతో నాని మొబైల్ కి బెస్ట్ విషెస్ చెబుతూ పలు SMS లు వస్తున్నాయట. కొంత మంది సినిమా వాళ్లు ఏకంగా ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెబుతున్నారట. దాంతో, ఇక లాభం లేదనుకుని తన పెళ్లి వార్తను నాని ఖండించాడు.
నాని ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంతో, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన 'ఈగ' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











