ప్రేక్షకులను ఇబ్బంది పెట్టొద్దు.. దర్శకుడికి సారీ చెబుతూ... ఉద్వేగంగా ఆర్ నారాయణమూర్తి
టాలీవుడ్ సినీ పరిశ్రమలో లాక్‌డౌన్ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ముందుకు వెళ్తున్ సమయంలో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, నభా నటేష్, దర్శకుడు సుబ్బు, నిర్మాత బీవీవీఎన్ ప్రసాద్‌తోపాటు ముఖ్య అతిథిగా నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ...

సినిమా భవిష్యత్ ఏమౌతుందో అనే..
కరోనావైరస్ కారణంగా అన్ని పరిశ్రమలు అల్లకల్లోలం అవుతున్న సమయంలో వలస కార్మికుల మాదిరిగా సినీ కార్మికుల భవిష్యత్ ఏమౌతుందో అని ఆలోచిస్తున్నా సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సొలో బ్రతుకే సో బెటర్. కరోనాను ఎదురించి అద్భుతంగా ఫలితాన్ని ఈ సినిమా సాధించడం, మళ్లీ పరిశ్రమలో థ్యాంక్స్ మీట్, ప్రెస్ మీట్ పెట్టుకోవడం నిజంగా అభినందనీయం అని పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి అన్నారు.

కేసీఆర్, వైఎస్ జగన్ వల్లే
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు. అలా సినిమా పరిశ్రమకు అండగా నిలవడంతో సోలో బ్రతుకే సో బెటర్ లాంటి పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే దర్శకుడు సుబ్బు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

మహానుభావుల మధ్య నేను...
సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలో హీరో సాయిధరమ్ తేజ్ నా అభిమానిగా నటించడం. ఈ చిత్రంలో వాజ్‌పేయ్, అబ్దుల్ కలాం, మమతా బెనర్జీ, మదర్ థెరిస్సా మధ్యన నా కటౌట్ పెట్టి నన్ను హైలెట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గౌరవం అందించిన దర్శకుడు సుబ్బు స్పూర్తి అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అని నారాయణమూర్తి అన్నారు.

ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులోనే..
ఏ యువకుడి జీవితంలో ఎప్పుడు జరిగే పనులు అప్పుడు జరగాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. పెళ్లి అంటే జీవితంలో కీలకం అంటూ మంచి సందేశం ఇచ్చిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ అందించింది. ఇందులో నన్ను ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో నన్ను భాగం చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్‌లకు మార్గం వేసింది అని నారాయణమూర్తి తెలిపారు.

టికెట్లు రేట్లు పెంచొద్దు...
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థ్యాంక్స్ మీట్‌లో ఒక విషయం తెలియచేయాలనుకొంటున్నా. కరోనా కష్టకాలంలో కేవలం సినిమా పరిశ్రమల వాళ్లే కాదు.. ప్రేక్షకులకు కూడా కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమా అంటూ టికెట్ల రేట్లు పెంచొద్దు. వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని నిర్మాత, దర్శకులు, హీరోలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమా అంటే తీసే వాడు.. చూసే వాడు.. థియేటర్ వాళ్లు బాగుండాలి అంటూ నారాయణమూర్తి వెల్లడించారు.


Click it and Unblock the Notifications











