'సౌందర్య చేసిన పనికి.. హీరోయిన్స్ తో అది మానేశా.. '
తెలుగు చిత్ర పరిశ్రమలో తొలుత హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలైన వారు చాలామంది ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు రాజా రవీంద్ర. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడిలో ఓ చిన్న రోల్‌లో తళుక్కున మెరిసిన ఆయన.. అప్పటి నుంచి నేటి వరకు తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూనే ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన రాజా రవీంద్ర గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. సినిమాలే కాదు.. బుల్లితెరపైనా నటించి ఇంటిల్లిపాదిని అలరించారు. విలన్, కమెడియన్, హీరో అసిస్టెంట్ వంటి విలక్షణ పాత్రల్లో జీవించారు.
ఇండస్ట్రీలో హీరో రవితేజతో రాజా రవీంద్రకు అనుబంధం ఎక్కువ. రవితేజతో పాటే ట్రావెల్ చేసిన ఆయన.. మాస్ మహారాజా ప్రతికష్టంలోనూ తోడుగా నిలిచాడు. రవితేజ పెళ్లి సమయంలో వారి అత్తమామలకు అనారోగ్యంగా ఉంటే కాళ్లు కడిగే కన్యాదానం చేసే బాధ్యతను రాజా రవీంద్రనే తీసుకున్నారట. తనను రవి మామా అంటూ పిలవడం కూడా ఇందుకు కారణమేనని ఆయన ఓ సందర్భంలో తెలిపారు.

ఈ వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న రాజా రవీంద్ర ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదని రాజా రవీంద్ర ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. హీరోగా చేయడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం హ్యాపీగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హీరో అంటే ఎంతో టెన్షన్ పడాలని.. అదే సినిమా ఫ్లాప్ అయినా సహాయ పాత్రలు పోషించిన వారిపై ఎలాంటి ప్రభావం పడదని రాజా రవీంద్ర పేర్కొన్నారు.
నటభూషణ శోభన్ బాబు బాటలోనే తాను కూడా నడుస్తున్నానని.. కొడుకులు, కూతుళ్లు ప్రశాంతంగా బతకాలని ఉద్దేశంతో తాను కూడా వారసులను పరిచయం చేయలేదన్నారు. సినిమాల్లో నటిస్తూనే పలువురు స్టార్స్‌కు మేనేజర్‌గానూ వ్యవహరించారు. రవితేజ స్టార్ హీరోగా మారిన తర్వాత తనను మేనేజర్‌ను చేశాడని, అలాగే డేట్స్ ఎలా చూడాలో తెలియదని చెబితే తనే దగ్గరుండి నేర్పించాడని రాజా రవీంద్ర గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది నటీనటులకు పర్సనల్ మేనేజర్‌గా పనిచేశానని ఆయన తెలిపారు.

మేనేజర్‌గా చేయడం అంత ఆషామాషీ కాదని ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని రాజా రవీంద్ర చెప్పారు. హీరోలు నెమ్మదిగా , ఒక సినిమా తర్వాత మరొకటి చేసుకుంటూ వెళ్తారు కాబట్టి వారితో ఏ ఇబ్బంది ఉండదన్నారు. కానీ హీరోయిన్లు ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలు, వేర్వేరు భాషలలో చేస్తుంటారని ఆ టైమ్‌లో టెన్షన్ మామూలుగా ఉండదని రవీంద్ర అన్నారు. ఉదాహరణకు సౌందర్యనే తీసుకుంటే అమితాబ్ బచ్చన్‌తో సూర్యవంశ్.. రజనీకాంత్‌తో నరసింహ.. చిరంజీవితో అన్నయ్యలలో సౌందర్య హీరోయిన్‌గా నటించారని తెలిపారు.
ఆ సమయంలో సౌందర్య, ఆమె సోదరుడు ఎంతో టెన్షన్ పడటం తాను చూశానని.. సౌందర్య ఫ్లైట్ మిస్ కావడం, షూటింగ్‌కు రాకపోవడంతో నరసింహ సినిమా చిత్రీకరణ ఒక రోజు ఆగిపోయిందని గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన తర్వాత హీరోయిన్ల డేట్స్ చూడకూడదని నిర్ణయించుకున్నానని రాజా రవీంద్ర వెల్లడించారు. హీరో రాజ్‌తరుణ్ ఓ ఇన్సిడెంట్‌లో ఇరుక్కుంటే అతని వద్ద డబ్బులు కొట్టేద్దామని ఓ వ్యక్తి ప్లాన్ చేసి బ్లాక్‌మెయిల్ చేశాడని .. దీంతో తాను ఆ వ్యక్తిపై కేసు పెట్టానని రాజా రవీంద్ర వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











