చిరంజీవి ఎవరెస్టులాంటి వారు.. ఆయన ప్రశంస ఆస్కార్‌తో సమానం..
ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నర్సింహరెడ్డి చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్న సమయంలో చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. ఆయనతోపాటు సుబ్బయ్య పాత్రధారి సాయిచంద్, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రవికిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, సాయిచంద్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మీడియాతో వారిద్దరూ పంచుకొన్న విషయాలు ఇవే..

మంచు పల్లకిలో చిరంజీవితో
సైరా నర్సింహారెడ్డి చిత్రంలో నా పాత్రకు వచ్చిన స్పందన నుంచి ఈ రోజే తేరుకొన్నాను. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను. న మంచు పల్లకి చిత్రంలో చిరంజీవితో కలిసి నటించాం. ఆ సమయంలో నాకు డ్యాన్స్ మూమెంట్లు నేర్పించాడు. ఆయనతో నాకు సోదర సమాన బంధం అని సాయిచంద్ అన్నారు.

చిరంజీవి ప్రశంస ఆస్కార్‌తో సమానం
అక్టోబర్ 2వ తేదీన సైరా రిలీజ్ తర్వాత అందరూ సుబ్బయ్య అని పిలుస్తున్నారు. నేను చాలా సినిమాలు చేశాను కానీ.. ఈ పాత్ర నుంచి ఇంకా బయటపడలేకపోయాను. ఆ సాయంత్రం చిరంజీవి గారు ఫోన్ చేసి నన్ను అభినందించారు. ఇంటిల్లిపాది నీ పాత్రకు కనెక్ట్ అయ్యారు. నీకు అవార్డు గ్యారెంటీ అన్నారు. దానికి సమాధానంగా.. చిరంజీవిగారు ఇండస్ట్రీలో ఎవరెస్ట్.. ఆయన ప్రశంస నాకు ఆస్కార్‌తో సమానం అని సాయిచంద్ అన్నారు.

విజయదశమి శుభాకాంక్షలు
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. సైరాతో గొప్ప విజయాన్ని అందించారు. ఈ విజయం సందర్భంగా ప్రతీ ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. మీడియాతో మాట్లాడాలని అనుకొని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా సాయిచంద్ నటించిన సుబ్బయ్య పాత్ర గురించి చెప్పాలనుకొన్నాను. ఆ పాత్రకు జీవం పోశారు అని చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు.

వృద్ధుడి పాత్రలో జీవించాడు
సాయిచంద్ వృద్ధుడి పాత్రలో కనిపించాడు. అతను నా వయసు వాడే. ఈ సినిమా కోసం పూర్తిగా వయసు మళ్లిన వాడిగా కనిపించాడు. గతంలో నేను, ఆయన హీరోలుగా కలిసి నటించాం. మంచు పల్లకి సినిమాలో కలిసి నటించాం. మా ఇద్దరి ప్రయాణం ఒకేలా సాగింది. ఈ పాత్ర కోసం తన రూపాన్ని మార్చుకొన్నారు. ఉప్పెన సినిమాలో అవకాశం వచ్చింది. అయినా సుబ్బయ్య పాత్ర కోసం ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











