ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ ఇకలేరు.. గుండెపోటుతో మృతి
ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఇక లేరు. ఆదివారం ఉదయం తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవ్సరాలు. వైజాగ్ మృతి వార్త సినీ, ప్రేక్షక వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. మూవీ ఆర్టిసు అసోసియేషన్ (మా) తరుపున వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు 'మా' అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వైజాగ్ స్వస్థలం కావడంతో
వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. ఆయన స్వస్థలం వైజాగ్ కావడంతో ఆయన పేరు వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. చదువుకునే రోజుల్నుంచే నాటకాల్లో నటించేవాడు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్ బి. ఎస్. సి లో సీటు, ఎం. బి. బి. ఎస్ సీటు పోగొట్టుకున్నాడు. తర్వాత బి. ఎ. చదివాడు.

వైజాగ్ ప్రసాద్ కుటుంబం
వైజాగ్ ప్రసాద్ భార్య విద్యావతి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. రత్నప్రభ, రత్నకుమార్. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు. కూతురు అమెరికాలో నివాసం ఉండగా అబ్బాయి లండన్ లో ఉంటున్నాడు. వీరిద్దరు వైజాగ్ చేరుకొన్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ చిత్రంతో
1983 లో ప్రముఖ దర్శకుడు జంధ్యాల రూపొందించిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను చిత్రంలో ఆయన పోషించిన ధనవంతుడైన కథానాయకుడి తండ్రి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. జై చిరంజీవ సినిమాలో కథానాయిక భూమిక తండ్రిగా గుర్తుండే పాత్రలో ఒదిగిపోయాడు.

వైజాగ్ ప్రసాద్ కెరీర్
వైజాగ్ ప్రసాద్ దాదాపు 50కి పైగా చిత్రాల్లో, పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించాడు. తెలుగులో వైజాగ్ ప్రసాద్ నటించిన నువ్వు నేను, భద్ర, జై చిరంజీవ, గౌరి, జానకి వెడ్స్ శ్రీరామ్, లయన్, ఫిట్టింగ్ మాస్టర్ చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించిపెట్టాయి.


Click it and Unblock the Notifications











