పని అమ్మాయిని హింసించిన కేసు.. తల్లీకూతుళ్ళిద్దరూ, భానుప్రియ సంచలన వ్యాఖ్యలు!
గురువారం రోజు ప్రముఖ తెలుగు మీడియా సంస్థల్లో సీనియర్ నటి భానుప్రియ గురించి సంచలన వార్తలు ప్రసారం అయ్యారు. భానుప్రియ తన ఇంట్లో పనిచేస్తున్న బలికని హింసిస్తోందంటూ వార్తలు వచ్చాయి. భానుప్రియ చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లో సామర్లకోటకు చెందిన ప్రభావతి అనే మహిళ కుమార్తె ఏడాది కాలంగా భానుప్రియ నివాసంలో పని అమ్మాయిగా ఉంటోంది. తన కుమార్తెని భానుప్రియ, ఆమె కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని, తనవద్దకు పంపకుండా నిర్బంధించారు అంటూ ప్రభావతి సామర్ల కోట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై భానుప్రియ స్పందించారు.

అనుమానం వచ్చింది
తన ఇంట్లో ఆ అమ్మాయి ఏడాది కాలంగా పనిచేస్తోంది అని భానుప్రియ తెలిపారు. మొదట్లో బాగానే ఉండేది. కానీ ఆ తర్వాత అప్పుడప్పుడూ డబ్బు నగలు కనిపించకుండా పోయేవి. అనుమానం వచ్చి ఆ అమ్మాయిని ఓ కంట కనిపెట్టాం అని భానుప్రియ తెలిపింది. నిజం చెప్పమని లేకుంటే పోలీసులకు చెబుతాం అని నిలదీయడంతో ఆ అమ్మాయి తాను చేసిన తప్పుని ఒప్పుకున్నట్లు భానుప్రియ తెలిపారు.

డబ్బు, నగలు వాళ్ళ అమ్మకు
దాదాపుగా 1.5 లక్షల డబ్బు, కొన్ని నగలు పోయినట్లు భానుప్రియ తెలిపింది. తన కుమార్తెని చూడడానికి ఆమె తల్లి ప్రభావతి తరచుగా వస్తూ ఉండేది. ఆ సమయంలో కుమార్తె దొంగిలించిన నగలు, డబ్బు తీసుకుని వెళ్లేదని మాకు తెలిసినట్లు భానుప్రియ తెలిపింది. కెమెరా, వాచ్ లాంటి వస్తువులు కూడా కొన్ని పోయాయని భానుప్రియ తెలిపింది. ఆమె కుమార్తె నిజం ఒప్పుకోవడంతో దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్లామని ప్రభావతికి చెప్పాం.

తీసుకువస్తానని వెళ్లి
పోలీస్ కేసు పెడతామని చెప్పడంతో ప్రభావతి కెమెరా, వాచ్, ఐపాడ్ లాంటి వస్తువులు తీసుకుని వచ్చింది. కానీ డబ్బు, నగలు తీసుకురాలేదు. డబ్బు, నగలు నా కుమార్తె ఇవ్వలేదని బుకాయించింది. గట్టిగా అడగడంతో తీసుకువస్తానని చెప్పి ఇంటికి వెళ్లిన ఆమె ఇప్పుడు తనపైనే కొత్త కథ సృష్టించి కేసు పెట్టిందని భానుప్రియ అన్నారు. ఆమె కుమార్తెని తాను, వేధిస్తున్నానని, ఇంటికి పంపకుండా బంధించానని తనపై కేసు పెట్టినట్లు భానుప్రియ తెలిపారు. ఈ వార్తలని మీడియాలో చూసి క్లారిటీ ఇవ్వాలని భావించా. అందుకే మీడియాని పిలిచా అని భానుప్రియ తెలిపారు. పని అమ్మాయిని కూడా ఆమె మీడియా ముందుకు తీసుకుని వచ్చారు.

నిజం ఒప్పుకుంది
పని అమ్మాయి మీడియాతో మాట్లాడుతూ తాను డబ్బు, కొన్ని వస్తువులు తీశానని తప్పుని ఒప్పుకుంది. ఇక్కడ తనని ఎవరూ వేధించలేదని.. నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారని ఆ అమ్మాయి తెలిపింది. తనని చూడడానికి తన తల్లి వచ్చినప్పుడు తాను తీసిన వస్తువులని ఆమెకు ఇచ్చానని పేర్కొంది. కొన్ని వస్తువులని తిరిగి ఇచ్చేసిందని, ఇక డబ్బు, నగలు ఇవ్వాలని తెలిపింది.


Click it and Unblock the Notifications











