‘‘పవన్ కళ్యాణ్... మనం దేవతలం, ఈ కుళ్లు రాజకీయాలు వద్దు’’
ఒకానొకప్పుడు రాజకీయాల్లో ఉండటం గౌరవ ప్రదంగా ఉండేది, ఇపుడు అలాంటి పరిస్థితి లేదు అంటున్నారు సినీయర్ తెలుగు నటి జమున. గతంలో తాను కూడా రాజకీయాల్లో పని చేశాను. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వారు పిలిచి సీటిస్తే రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టినట్లు జమున ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నారు.
ఇపుడు రాజకీయాలు కమర్షియల్ అయ్యాయి. కోటి రూపాయలు ఖర్చు పెట్టి పోటీ చేయ్, తర్వాత పది, ఇరవై కోట్లు సంపాదించుకో అనే విధంగా ఉన్నాయి. సేవా దృక్ఫథంతో ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా స్వార్థంతో కూడుకున్న వాతావరణం కనిపిస్తోందని తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చే హక్కు అందరికీ ఉంది
రాజకీయాల్లోకి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సామాన్యుడికి, వీవీఐపీలకు, సినిమా వారు ఇలా అందరూ అర్హులే. ఎన్టీ రామారావుగారు కేవలం 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే నేను ఎంపిగా పోటీ చేసి గెలిచాను. కృష్ణ, కృష్ణం రాజు రాజకీయాల్లోకి వచ్చారని ఆమె అన్నారు.

సినిమా వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది
ఇకప్పటిలా ఇపుడు పరిస్థితి లేదు. సినిమా వారు రాజకీయాల్లోకి రాకుండా ఉండమే మంచిది. చిరంజీవిగారికి కూడా ఈ విషయం చెప్పాను. మీరంటే జనం పడి చచ్చిపోతారు. దయచేసి ఈ కుళ్లు రాజకీయాల్లోకి రావద్దు అన్నాను. కానీ ఆయన నవ్వేసి ఊరుకున్నారు. వచ్చాక ఏమైందో అనేది అందరికీ తెలుసు.

మా తరం వరకు రాజకీయాలు హాయి
మేమంతా ఈ కుళ్లును కడిగేస్తాం అంటే చాలా కష్టం. జరిగే పని కాదు. ఈ కుళ్లు రాజకీయాల్లో అలా బ్రతకాల్సిందే. నాయక్ సినిమాల్లో మాదిరిగా కడిగి, తుడిచి శుద్ధి చేయడం అసాధ్యం. అలా చెయ్యాలని ప్రయత్నం చేసిన వారు ఆరిపోయారు. మా తరం వరకు రాజకీయాలు హాయిగా ఉన్నాయి, అపుడు ఈ కుళ్లులేదన్నారు.

పవన్ కళ్యాణ్... మనం దేవతలనం
చిరంజీవి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి డైరెక్టుగా చెప్పి వచ్చాను. ఇప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్ లాంటి వారు పరిచయం లేదు కాబట్టి సలహాలు ఇవ్వలేను. మీడియా ముందు చెప్పమంటే చెబుతాను. రాజకీయాలు వద్దు మనకు, మనం కళాకారులం... దేవతలం. దేవతలుగా పూజింపబడుతున్నాం. ఆ పూజను అలాగే దక్కించుకుందామని జమున చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











