నటి జయప్రద కుటుంబంలో పెను విషాదం!
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకొన్నది. అత్యంత ఆప్తుడైన ఆమె సోదరుడు రాజబాబు ఆకస్మిక మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. సోదరుడు మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న జయప్రదకు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన సినీ, రాజకీయ నాయకులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె సోదరుడి మరణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
జయప్రద సోదరుడు రాజబాబు నటుడిగా తెలుగు సినిమా రంగంలో సుపరిచితులు. ఆయన రాజమండ్రి రోమియోలు, బోరింగ్ పాప లాంటి చిత్రాల్లో హీరోగా నటించారు. జయప్రద హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఉన్న సమయంలో తన సోదరుడిని హీరోగా చూడాలనే ప్రయత్నం చేశారు. కానీ ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం సాధించకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకొన్నారు. ఆ తర్వాత తన సోదరికి అండదండలు అందిస్తూ.. వ్యాపారపరమైన కార్యక్రమంలో బిజీగా మారిపోయారు.

అయితే సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమైన రాజబాబు గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. కానీ ఇటీవల కాలంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయనకు వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందించనప్పటికీ.. ఆయన కోలుకోలేకపోయారు. చివరకు అపోలో హాస్పిటల్‌లో ఫిబ్రవరి 28వ తేదీన మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు అని సన్నిహితులు ఓ ప్రకటనలో తెలిపారు.
రాజబాబుకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా, ఫోన్ ద్వారా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











