ఎన్ని కుట్రలు చేసినా నా పోరాటం ఆగదు.. మా సస్పెన్షన్ వేటుపై కరాటే కళ్యాణి సంచలన కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణిని మా సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు ఖమ్మంలో ఆయన 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అది కూడా కృష్ణావతారంలో ఉన్న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. మే 28వ తేదీన ఆ విగ్రహావిష్కరణ జరగనుంది.
అయితే, ఈ విషయంపై గత కొద్దిరోజులుగా కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో వివాదం తలెత్తడంతో, ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా స్పందించకపోవడంతో మా నుంచి సస్పెండ్ చేశారు. కాగా, తనను మా నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె బాధ వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి ఈ విధంగా బుద్ధి చెప్పారని ఆమె బాధపడ్డారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తన పోరాటం మాత్రం ఆగదని ఆమె పేర్కొనడం గమనార్హం.

తాను ఎంతో నిజాయితీగా ఉన్నానని, అలాంటి తనకు ఇలాంటి బహుమతి ఇస్తారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 23ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడినా, నా ఇండస్ట్రీ అనుకుంటూ తానే అన్నింటికీ ముందుండేదానినని ఆమె గుర్తు చేశారు. తాను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించలేదని ఆమె చెప్పారు. కేవలం కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రమే పెట్టవద్దని కోరానని చెప్పడం విశేషం. ఆ మాత్రం దానికే తనమీద కక్ష కట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
షోకాజ్ నోటీసులు వచ్చినప్పుడు తనకు ఆరోగ్యం సరిగాలేక సమాధానం ఇవ్వలేదని ఆమె చెప్పారు. కేవలం మూడు రోజుల్లో సమాధానం చెప్పమన్నారని, తాను వారం రోజులు సమయం ఇవ్వమని అడిగినా ఇవ్వలేదని, ఏకంగా ఇప్పుడు సభ్యత్వం రద్దు చేశారని ఆమె ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిమీదా ద్వేషం లేదని ఆమె అన్నారు.
తాను ఏ రోజూ మా అసోసియేషన్ ని కించ పరచలేదన్నారు. తాను కూడా ఏ తప్పు చేయలేదన్నారు. ఎవరి ఒత్తిడితోనైనా ఇలా చేసి ఉండొచ్చు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆపాలని చూస్తున్న ఆమెకు మా సభ్యత్వం రద్దు చేయడం పట్ల నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











