ఆరిపోతున్న వరద బాధితుల జీవితాలను ఆదుకోలేక పోతున్నా 'తారలు'
ఆ మధ్య రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో ఎవరికి తోచిన సాయాన్ని వారు వస్తు, ధన రూపేణా చేస్తున్నారు. ప్రముఖంగా సినిమా, వ్యాపార రంగాలకు చెందిన వారు విరాళాలు అందించడంలో ముందుంటుంన్నారు. హీరోల్లో జూనియార్ ఎన్టీఆర్ అందరి కంటే ఎక్కువగా రూ. 40 లక్షల సాయం చేశారు. నందమూరి బాలయ్య రూ.20 లక్షలు, రామ్ చరణ్ 10, అల్లు అర్జున్, సిద్దార్థ, గోపీచంద్ తలా 5 లక్షల రూపాయలు తమ వంతు విరాళంగా అందజేశారు. ప్రముఖ నటుడు, టిడిపి రాజ్యసభ సభ్యడు హరికృష్ణ కూడా తమ రెండు నెలల జీతాన్ని(రూ. 20లక్షలు)విరాళంగా అందించారు.
సినిమా రంగానికి చెందిన వారు అనగానే హీరోయిన్లు కూడా వస్తారని వేరే చెప్పనక్కర్లేదు. అయితే బాధితులను ఆదుకోవడంలో ఏ ఒక్క హీరోయిన్నూ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా సాయం చేసిన పాపాన పోలేదు. బాలీవుడ్ తర్వాత అత్యధిక పారితోషికాలు అందించే టాలీవుడ్ లో ఎంతో మంది పరభాషా భామలు పాగా వేశారు. వారిలో త్రిష, అనుష్క, ఇలియానా, నయనతార, ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీరంతా టాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్నవారే. వారు నటించిన సినిమాలు హిట్ అయితే చాలు షరా మామూలుగా రెమ్యూనరేషన్ అమాంతం పెంచుకున్నారు. వారిలో కొందరి పారితోషికం కోటి రూపాయల మార్కును కూడా క్రాస్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను బాగా వంట బట్టించుకున్న వీరంతా ఆరిపోతున్న వరద బాధితుల జీవితాలను తమ వంతుగా ఆదుకోవడానికి ముందుకు రాలేకపోతుండటం శోచనీయం.


Click it and Unblock the Notifications











