ఎక్కడున్నా నీ కోసమే.. శ్రావణి ఆడియో టేప్ లీక్.. లవ్‌స్టోరీలో కొత్త ట్విస్టు.. దేవరాజ్, సాయి అరెస్ట్
టెలివిజన్ నటి శ్రావణి సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారంలో బయటపడుతున్న ఆడియో టేపులు ఈ కేసును పలు విధాలుగా మలుపు తిప్పుతున్నది. తొలుత దేవరాజ్ రెడ్డిపైనే అనుమానాలు, ఆరోపణలు రాగా, ఆ తర్వాత పలు రకాల వ్యక్తులు తెరపైకి వచ్చారు. అయితే ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో అనిశ్చిత నిర్ణయాలు శ్రావణి ప్రాణాల మీదకు తెచ్చినట్టు స్పష్టమవుతున్నది. టెలివిజన్ సీరియల్‌లా సాగుతున్న వ్యవహారంలో శ్రావణి తన తల్లి సత్యవతితో చెప్పిన విషయాలు, దేవరాజ్, సాయి ఇతరుల మధ్య చోటుచేసుకొన్న సంఘటనలు ఈ కేసును మరింత వివాదాస్పదంగా మారుస్తున్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన విషయాలు ఏమిటంటే..

దేవరాజ్‌పై మనసు మార్చుకొన్న శ్రావణి
తాజాగా మీడియాకు చిక్కిన ఆడియో ఫైల్‌లో దేవరాజ్‌పై అభిప్రాయాన్ని మార్చుకొని పెళ్లికి సిద్ధమైనట్టు స్పష్టమైంది. గతంలో దేవరాజ్ తనను వేధిస్తున్నారనే ఆరోపణతో దేవరాజ్‌పై శ్రావణి ఎస్ఆర్ నగర్‌లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలతో కేసు ఉపసంహరించుకొని పెళ్లి చేసుకొనేందుకు సిద్దపడ్డారనే విషయం ఆడియో టేప్‌లో స్పష్టమైంది. తన తల్లి సత్యవతితో మాట్లాడిన టేప్ ఇప్పుడు అనేక ప్రశ్నలకు సమాధానంగా మారుతున్నది.

తల్లి సత్యవతితో సంభాషణ టేప్ లీక్
తాజాగా లీకైన ఆడియో ప్రకారం.. దేవరాజ్‌ను ఇష్టంతో పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. కేసు ఉపసంహరించుకొన్న తర్వాత పెళ్లి చేసుకొందామని దేవరాజ్ చెప్పాడు. మీరు ఒప్పుకొంటే పెళ్లి చేసుకొంటాను. పెద్ద మనుసుతో ముందుకొచ్చి మాకు పెళ్లి చేయండి. ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి చేసుకొని సు:ఖ పడుతాం అని తల్లి సత్యవతితో శ్రావణి మొరపెట్టుకొన్నారు.

నేను ఎక్కడున్నా నీకు విషెస్
దేవరాజ్ బర్త్ డే సందర్భంగా శ్రావణి జరిపిన ఫోన్ సంభాషణ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. దేవరాజ్‌తో మాట్లాడినట్టుగా ప్రచారం అవుతున్న వీడియోలో శ్రావణి.. నాకు ఎంతో మంది పరిచయం ఉన్నారు. కానీ అందులో మీరు మాత్రమే నాకు ప్రత్యేకం. నాకు తెలిసినంత వరకు నీలో లోపాలు కనిపించలేదు. నా గురించే నీవు ఆలోచించే తీరే నీ మీద ప్రేమకు కారణం. నేను ఎక్కడున్నా నీకు శుభాకాంక్షలు ఎప్పుడూ చెబుతూనే ఉంటాను అని అనడం గమనార్హం.
Recommended Video

దేవరాజ్, సాయి అరెస్ట్
ఇలాంటి ఫోన్ సంభాషణలు, మీడియాకు నిందితులు సాయి, దేవరాజ్ చెబుతున్న విషయాలు ఒకదానికి ఒకటి పొంతలేకుండా మారాయి. ఈ క్రమంలో దేవరాజ్, సాయిని ఒకరి ముందు మరొకరి కూర్చోపెట్టి పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1, ఏ2 ఎవరనేది సోమవారం నిర్ణయించనున్నారు. ఆ తర్వాత సెక్షన్లతో కూడిన కేసును పోలీసులు ఫైల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అరెస్ట్ చేసిన ఇద్దరిని సోమవారం కోర్టులో ప్రవేశపెడుతారు.


Click it and Unblock the Notifications











