మన సినిమాలపై నలభై యేళ్ల నిషేధం ఎత్తివేత
బంగ్లాదేశ్ లో బాలీవుడ్ సినిమాలపై గత నలభైయేళ్లుగా అమలులో వున్న నిషేధాన్ని ఎత్తివేశారు. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోవడం, స్థానిక నటీనటులు, దర్శకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా నిషేధాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లా మంత్రి ఒకరు వెల్లడించారు. స్థానిక సినీ పరిశ్రమను పరిరక్షించే ఉద్దేశంతో బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చిన 1972 సంవత్సరం నుంచి దేశంలో బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిషేధించారు. అయితే ఇప్పుడదే సినిమా పరిశ్రమకు ఊతమిచ్చేందుకు నిషేధాన్ని ఎత్తివేశామని వాణిజ్య మంత్రి ఫారుఖ్‌ఖాన్ తెలియజేశారు. దేశంలో భారతీయ సినిమాలను అనుమతించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న థియేటర్ల యజమానులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే భారత సినిమాలను ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం దేశీయ సినిమా పరిశ్రమకు మేలు చేస్తుందని బంగ్లా సినిమా థియేటర్ల యాజమానుల సంఘం అధ్యక్షుడు కాజి ఫిరోజ్ రషీద్ అన్నారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా బంగ్లాలో ప్రేక్షకుల సంఖ్య బాగా క్షీణించింది. 2000 నాటికి దేశంలో 1600 సినిమాహాళ్లు వుండగా 2010 నాటికి వీటి సంఖ్య 600లకు పడిపోవడం దీనికి నిదర్శనం గా చెప్తున్నారు. ఇక మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రంతో అక్కడ సినిమా సందడి మొదలెడతారని తెలుస్తోంది. షారూఖ్, కాజోల్ కాంబినేషన్లో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని రూపొందించారు.


Click it and Unblock the Notifications











