'విశ్వరూపం-2' చిత్రం టైటిల్, కథ ఏమిటి
హైదరాబాద్ : ఎన్నో వివాదాలు మూట కట్టుకుని కమల్ హాసన్ విశ్వరూపం థియోటర్స్ లోకి వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు కమల్‌హాసన్ 'విశ్వరూపం-2'ని తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. విశ్వరూపం చిత్రానికి కొనసాగింపు ఉంటుందని కమల్ ఇది వరకే పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని 'మూ' పేరుతో విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం.
ఈ సీక్వెల్ చిత్రంలో కమల్ మూడు పాత్రల్లో కనిపిస్తారు. అందుకే ఆ పేరుని నిర్ణయించారని తెలుస్తోంది. తొలి భాగంలో తీవ్రవాది ఒమర్ అమెరికా నుంచి తప్పించుకున్నట్లు చూపించారు. అతను భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నించటాన్ని, అది హీరో అడ్డుకోవటాన్ని రెండో భాగంలో చూపిస్తారు. కొనసాగింపు చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
తమిళనాడు ప్రభుత్వం 'విశ్వరూపం'పై ఆదివారం నిషేధాన్ని ఎత్తివేయటంతో కమల్ హాసన్ తాను మద్రాస్ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఉపసంహరించుకున్నారు. జస్టిస్ ఎస్.రాజేశ్వరన్ కమల్ పిటిషన్‌ను విచారిస్తున్నారు. ప్రభుత్వం, కమల్ కూడా తమతమ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు ఆయన అనుమతించారు. అంతేగాక రాజీపడేందుకు సిద్ధమని ఇరు పక్షాలు (కమల్ వెర్సస్ ముస్లిం గ్రూపులు) కూడా సన్నద్ధత వ్యక్తం చేశాయి. దాంతో వారం రోజులుగా నలుగుతున్న వివాదానికి తెరపడింది.
తమిళనాడులోని జిల్లా కలెక్టర్లు తాము విధించిన నిషేధపుటుత్తర్వులను ఎత్తివేశారు. దాంతో రూ.100 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం తమిళనాడులో విడుదలకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 7న చిత్రం ఈ రాష్ట్రంలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. తమ సాంకేతిక బృందంతో చర్చించిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తానని కమల్ చెప్పారు. మార్పుల గురించి సెన్సార్ బోర్డుకు కూడా సమాచారం అందిస్తానన్నారు. 3 భాషలలో ఈ చిత్రం నిర్మితమైంది. జనవరి 11నే విడుదల కావలసి ఉన్నప్పటికీ ముస్లిం గ్రూపులు వ్యతిరేకత వ్యక్తం చేయటంతో సాధ్యపడలేదు.


Click it and Unblock the Notifications











