ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, అభిమానుల్లో ఆందోళన
బాలీవుడ్ మాజీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా శనివారం లీలావతి ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి సీనియర్ వైద్యుడు తెలిపారు. ఐతే ఆయన ఆనారోగ్యానికి సంబంధించిన వివారాలను మాత్రం డాక్టర్లు తెలియజేయలేదు. లీలావతి ఆస్పత్రిలో మొదటగా ఔట్ పేషెంట్ విభాగానికి తీసుకెళ్లి, ఆ తర్వాత అక్కడ్నుంచి 11వ అంతస్తుకు తరలించారు. ఖన్నా వెంట ఆయన మాజీ భార్య డింపుల్ కపాడియా, పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా ఉన్నారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రత పెంచారు.
మీడియాను ఆస్పత్రి ఆవరణలోకి అనుమతించడం లేదు. ఖన్నా స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, కాస్త నీరసంగా కూడా ఉన్నారని, అందుకే ఆస్పత్రిలో చేర్చామని ఆయన మాజీ భార్య డింపుల్ తెలిపారు. ఖన్నా కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. రాజేశ్ ఖన్నా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు మూడు రోజుల క్రితం వార్తలు రావడం, ఆయన అల్లుడు అక్షయ్ కుమార్ ఆ తర్వాత వాటిని ఖండించడం తెల్సిందే. ట్వింకిల్ ఖన్నాను అక్షయ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఐతే రాజేష్ ఖన్నా గురువారం అల్లుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి తన ఇంటి బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం కూడా చేశారు. ఐతే శనివారం ఆయన ఆస్పత్రిలో చేరడంతో అభిమానుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.


Click it and Unblock the Notifications











