Aishwarya Rai రాహుల్ గాంధీ నోట పదే పదే ఐశ్వర్యరాయ్.. మండిపడుతున్న బీజేపీ నేతలు.. ఏం జరిగిందంటే?
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే అధికార ప్రభుత్వం తీరును తనదైన శైలిలో ఎండగడుతున్నారు. తన ర్యాలీలో, సభల్లో ప్రధానంగా సినీ నటులు ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ పేర్లను ఉచ్చరించడం అత్యంత చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ ప్రసంగాల్లో వారి పేర్లు పలకడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ పదే పదే బచ్చన్ ఫ్యామిలీ పేర్లు ఎందుకు తీస్తున్నారనే విషయంలోకి వెళితే..
భారత్ జోడో యాత్ర విజయవంతమైన తర్వాత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ జోడో న్యాయ్ యాత్రను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పార పడుతున్నారు. పేద ప్రజలను, దళితులను, బీసీలను పట్టించుకోవడం లేదు అంటూ రాహుల్ గాంధీ ధ్వజమెత్తుతున్నారు. తన ప్రసంగాల్లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ పేర్లను లాగుతూ కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం అయోధ్యలో రామమందిరం ప్రారంభించినప్పుడు ఆ సభా ప్రాంతంలో దళితులు, బీసీ నేతలను ఆహ్వనించలేదు. కేవలం అగ్రకులాలకు మాత్రమే పెద్ద పీట వేశారు. 13 శాతం జనాభా లేని వాళ్లకు అగ్రతాంబులం ఇచ్చారు. 80 శాతానికిపైగా ఉన్న బీసీలు, దళితులు, గిరిజనులకు ఆ వేడుకలో స్థానం లేకపోయింది అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.
రామమందిరం ప్రారంభ వేడుకల్లో మీడియాలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్‌ను మాత్రమే చూపించారు. అటు చూడు ఐశ్వర్యరాయ్, ఇటు చూడు అమితాబ్ బచ్చన్ అంటూ ఊదరగొట్టారు. కానీ ఏ ఒక్క తక్కువ కులాలకు చెందిన నేతలు, ప్రజలను ఆహ్వానించిన ఆనవాళ్లు కనిపించలేదు. తక్కువ జనాభా ఉన్న వారికే పెద్ద పీట వేయడం సాధ్యమా? అంటూ రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు.

అయితే రాహుల్ గాంధీ పదే పదే ఐశ్వర్యరాయ్ పేరును ప్రస్తావించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. రాహుల్ గాంధీ నిత్యం బీజేపీని టార్గెట్ చేస్తూ ఐశ్వర్యరాయ్ పేరును ఉచ్చరించడంపై ఎంపీ సృతి ఇరానీ ధ్వజమెత్తారు. ఐశ్వర్య తప్ప మరెవరూ మీకు కనిపించారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్‌ను ఈ వివాదంలోకి లాగుతున్నారు. ప్రధాని మోదీపై విమర్శలు చేసే ఆమె.. ఈ వ్యవహారంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ పేర్లను పదే పదే ఉచ్చరించడంపై ఆమె ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











