ఆనందమో..బాధో అర్థంకాని స్థితిలో ఐష్
ఆనంద పడాలో..బాధ పడాలో అర్థం కావడం లేదంటూ మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ నిర్వేదం వ్యక్తం చేసింది. ఇందు కారణం ఐశ్వర్యపై జనాల్లో అతిగా పెరిగి పోయిన అభిమానమే. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఐష్ గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితం అయింది. పుట్టబోయే బిడ్డ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవల గణేష్ నవరాత్రోత్సవాలు జరిగిన నేపథ్యంలో గర్భవతిగా మళ్లీ లంబోదరుడిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందో లేదో అని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆమె ముంబయ్‌లోని ఓ గణేశ్ టెంపుల్‌లో దర్శనమివ్వగానే... అక్కడ జాతర వాతావరణం నెలకొంది.
వేలాదిమంది అభిమానులు ఆమెను చుట్టుముట్టేయడంతో పరిస్థితిని చక్కదిద్దడం పోలీసుల వల్ల కూడా కాలేదు. పైగా ఐశ్వర్య గర్భవతి. ఈ విషయాన్ని గమనించకుండా అభిమానులు చూపిన అత్యుత్సాహంపై ఆమె తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎలాగైతేనేం... సెక్యూరిటీ సిబ్బంది ఆమెను జాగ్రత్తగా కారెక్కించారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ -''ఇంతమంది నాపై చూపిస్తున్న ఈ అభిమానాన్ని చూసి ఆనందపడాలో... లేక మితిమీరిన మీ ఆనందాన్ని చూసి బాధ పడాలో అర్థం కావడంలేదు అంటూ తన మనసులోని భావాన్ని బయటకు వెల్లగక్కింది.


Click it and Unblock the Notifications











