మరో ఛత్రపతి (డేవిడ్ బిల్లా ప్రివ్యూ)
అజిత్ హీరోగా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన తమిళ చిత్రం 'బిల్లా-2' తెలుగులో 'డేవిడ్ బిల్లా' టైటిల్ తో ఈ రోజు విడుదల అవుతోంది. బిల్లా చిత్రానికి ప్రీక్వెల్ గా చెప్పబడుతున్న ఈ చిత్రంలో డేవిడ్ (అజిత్) ఓ సామాన్య యువకుడు. బతుకుదెరువు కోసం గోవా చేరుకొంటాడు. అక్కడో మంచి ఉద్యోగం సంపాదించుకొని అందరిలా స్థిరపడాలనేది అతని ఆశయం. కానీ... అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఒక్క పూట కడుపు నింపుకోవడమే గగనమైపోతుంది. తిరుగుబాటు ఒక్కటే శరణ్యమని, యుద్ధంలో గెలవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫర్లేదనే భావనకు వస్తాడు. చిన్న చిన్న రౌడీ మూకల్ని మట్టి కరిపించి.. వారందరికీ నాయకుడిగా మారతాడు. అక్కడి నుంచి అతని ప్రయాణం ఎలా సాగింది? డేవిడ్ జీవితం బిల్లాగా ఎలా రూపుదాల్చింది? ఈ విషయాలన్నీ తెరపై చూడాల్సిందే.
దర్శకుడు మాట్లాడుతూ ''ఇప్పటి వరకూ కొనసాగింపు కథలే చూశాం. 'డేవిడ్ బిల్లా'లో మాత్రం బిల్లా కథకు ముందు ఏం జరిగిందో చూపిస్తున్నాం. మనిషి తనతో తాను ఎలా పోరాటం చేస్తాడు అనే విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాం. యాక్షన్ ఘట్టాలు హలీవుడ్ సినిమాల్ని తలపిస్తాయ''న్నారు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను మీనాక్షి దీక్షిత్ పోషించారు.
1200 థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున డేవిడ్‌బిల్లా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఎస్వీఆర్ మీడియా అధినేత్రి శ్రీమతి శోభారాణి తెలిపారు. అజిత్ కెరీర్‌లో పెద్ద సినిమా అని తెలిపారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో తనకు తానే సాటి అనే విధంగా అద్భుతంగా అజిత్ చేశారని, ఆయన పెర్‌ఫార్మెన్స్, చక్రి తోలేటి టేకింగ్ హైలైట్‌గా కలిసిందని, చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొంది, మా ఎస్వీఆర్ మీడియాలో మరో సూపర్‌హిట్ చిత్రంగా 'డేవిడ్‌బిల్లా' నిలుస్తుందన్న నమ్మకం తనకు వుందని అన్నారు.
సంస్థ: ఎస్వీఆర్ మీడియా
నటీనటులు: అజిత్, బ్రూనా అబ్దుల్లా, పార్వతి ఓమనకుట్టన్, ప్రభు, రెహమాన్, మనోజ్ కె.జయన్, శ్రీరామ్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్‌రాజా,
ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్
నిర్మాత: శోభారాణి
దర్శకత్వం: చక్రి తోలేటి
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











