వర్మతో సినిమా చేయడంపై స్పందించిన అఖిల్ అక్కినేని!
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన 'శివ' సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్. అయితే దాదాపు 25 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో 'ఆఫీసర్' సినిమా అనగానే మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావించారు. వర్మ వరుస ప్లాపులు తీస్తున్నారనే విషయం కూడా మరిచిపోయి 'ఆఫీసర్'పై అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్.
'ఆఫీసర్' సినిమా విడుదల ముందే తన నెక్ట్స్ సినిమా అఖిల్‌తో ఖరారైంది అని వర్మ ప్రకటించడం కూడా.... ఈ సారి ఆర్జీవీ గొప్ప సినిమానే తీశాడేమో? అందుకే నాగార్జున తన కొడుకు సినిమా కూడా ఇతగాడి చేతిలో పెట్టాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే... 'ఆఫీసర్' నాగార్జున కెరీర్లోనే పెద్ద ప్లాప్. తాను ఇప్పటి వరకు తీసిన చెత్త సినిమాల్లోకెల్లా చెత్త సినిమా అని విమర్శలు మూటగట్టుకున్నాడు వర్మ.

ఈ దెబ్బతో అక్కినేని అభిమానుల్లో ఆందోళన మొందలైంది. వర్మగానీ తన తర్వాత సినిమా అఖిల్‌తో తీస్తే పరిస్థితి ఏమిటి? అనే ఆలోచనలో పడిన ఫ్యాన్స్.... దయచేసి అక్కినేని ఫ్యామిలీని వదిలేయాలని ఆర్జీవీని వేడుకున్న సంగతి తెలిసిందే.
వర్మతో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తపై అఖిల్ అక్కినేని స్పందించారు. 'నేను వర్మ దర్శకత్వంలో చేస్తున్నట్లు ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో తెలియదు. ఇందులో నిజం లేదు. నా ఫోకస్ అంతా వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాపైనే ఉంది. ఈ సినిమా ఆలోచన తప్ప మరే ఆలోచన నా మైండ్‌లో లేదు అని అఖిల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











