‘అక్కినేని’ వారి డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతేంటి?
అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలను ఒకే సినిమాలో చూపెడుతూ ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ చేతిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని ఆ మధ్య వినిపించినా....అది ఆచరణకు నోచుకోలేదు. కారణం కృష్ణ వంశీ తయారు చేసుకున్న కథ నాగార్జునను సంతృప్తి పరచక పోవడమే.
తాజాగా ఈ ప్రాజెక్టును దర్శకుడు విక్రమ్ కుమార్ హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 13బి చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్...ఇటీవల ఇష్క్ చిత్రంతో తెలుగులో హిట్ కొట్టాడు. అతడు చెప్పిన కథ నాగార్జునకు బాగా నచ్చడంతో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కులో బిజీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా తన సొంత బ్యానరైన అన్నపూర్ణ స్టూడియోస్‌పై వాల్ డిస్నీ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నాగార్జున కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో షిరిడి సాయి చిత్రం చేస్తున్నారు. తన గత భక్తిరస చిత్రాలైన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో భక్తుడిగా కనిపించిన నాగార్జున ఈ చిత్రంలో తొలిసారిగా దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











