ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో ట్విస్ట్.. రేవంత్ సర్కార్ కు నాగార్జున షాక్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో, ఏ స్టెప్ తీసుకుంటారోనిన ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ దశలో నాగార్జునకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్ట్.. తక్షణం కూల్చివేత పనులను నిలిపివేయాలని స్టే ఆర్డర్ మంజూరు చేసింది.
తుమ్మిడికుంట ప్రాంతంలోని ఓ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లుగా అప్పట్లోనే బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దానిని కూల్చివేయాలని గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. అయితే నాగార్జునకు ప్రభుత్వ పెద్దలతో ఉన్న పరిచయాలు , పలుకుబడితో కూల్చివేత ఆగిపోయిందని ఇప్పటికీ ఫిలింనగర్‌లో చర్చించుకుంటూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం .. హైడ్రా ఏర్పాటుతో అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తోంది.

కబ్జాలు, అక్రమ నిర్మాణాలతో పాటు విపత్కర పరిస్ధితుల్లో ప్రజలకు అండగా ఉండేందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఓ ఫిర్యాదు అందింది. దీనిని పరిశీలించిన మంత్రి .. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు ఆదేశాలు జారీ చేశారు.
తుమ్మడికుంట చెరువు సరిహద్దులు, నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి తీసుకున్న అనుమతులు , ఇతర విషయాలను పరిగణలోనికి తీసుకున్న హైడ్రా టీమ్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు నిజమేనని నిర్ధారించింది. దానిని కూల్చివేయాలని భావించి శనివారం బుల్డోజర్లు, అధికారులు, భారీ భద్రత మధ్య హైడ్రా టీమ్ పని ముగించింది. ఈ నేపథ్యంలో నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు.

ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి అని.. అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని నాగార్జున తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతకు దిగారని.. విషయం కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి పనులు సరికాదని.. ఒకవేళ తనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిస్తే తానే కూల్చివేసేవాడినని నాగార్జున పేర్కొన్నారు. తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న నాగ్.. చెప్పినట్లుగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ టి . వినోద్ కుమార్ బెంచ్.. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











