పౌరాణికాలకీ, నందమూరి వంశానికీ అవినాభావ సంబంధం..!
పౌరాణిక చిత్రాలకీ, నందమూరి వంశానికీ అవినాభావ సంబంధముందని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. శ్రీరామరాజ్యం' చిత్రంలో వాల్మీకి పాత్ర పోషించిన ఆయన ఈ సినిమా ఆడియో అభినందన వేడుకలో మాట్లాడుతూ ఎన్టీఆర్, బాలకృష్ణలను ఆకాశానికెత్తేశారు. నేను రాముడి వేషంతో కెరీర్ ప్రారంభించా. నిజానికి 'లవకుశ'లో రాముడి వేషానికి మొదట నన్ను వేయమన్నారు అంజలీదేవి, ఆదినారాయణరావు. రాముడు ఆజానుబాహుడు, అరవిందదళాయతాక్షుడు అని రాశారు కాబట్టి నేను ఆ పాత్రకి సరిపోననీ, రామారావుగారైతే బాగుంటారనీ చెప్పా. అది రికమెండ్ చేయడం కాదు. నిజం చెప్పడం. అలా ఎన్టీఆర్ ఆ పాత్రచేశారు. 'కృష్ణార్జున యుద్ధం'లో డైరెక్టర్ కె.వి. రెడ్డిగారు నన్ను శ్రీకృష్ణుని పాత్ర చేయమన్నారు. ఎందుకంటే అర్జునుడు ఆజానుబాహుడు, మహావీరుడు కాబట్టి.
కానీ అప్పటికే కె.వి. రెడ్డిగారు రామారావుగార్ని శ్రీకృష్ణునిగా తీర్చిదిద్దారు. అందువల్ల శ్రీకృష్ణునిగా నేనువేస్తే చెల్లుబాటు కాదని చెప్పి, నేను అర్జునునిగా పనికిరానని తెలిసినా చేశాను. ఆ సినిమా చూసిన నా భార్య అన్నపూర్ణ నాతో రామారావుగారు చేసిన పౌరాణికాల్లో మీరు చేయకండని చెప్పింది. అదీ రామారావుగారి ప్రభావం. పౌరాణిక సినిమాలకీ, నందమూరి వంశానికీ అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ కాకుండా రాముడి వేషం వెయ్యడానికి ఎవరూ లేరు" అని చెప్పారు.


Click it and Unblock the Notifications











