తాగుబోతు అక్కినేని అంటారేమో! భయపడ్డాడట!?
కొన్నేళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావుతో మాటీవీ 'గుర్తుకొస్తున్నాయి" అన్న వీక్లీ ప్రోగ్రాం చేసింది. దీనికి మంచి ఆదరణ కూడ వచ్చింది. సుదీర్ఘ సినీ ప్రస్తానంలోని అనుభవాలను, అనుభూతులను అక్కినేని అందులో పంచుకున్నారు. మోసర్ బేర్ సంస్థ 'గుర్తుకొస్తున్నాయి" ఎపిసోడ్స్ను 25 వీసీడిల్లో పొందుపరిచి ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ వీడియో ఆవిష్కరణ అన్నపూర్ణ స్టూడియోలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా 'గుర్తుకొస్తున్నాయి" ప్రోగ్రాం మూలకర్త హాసం రాజాను అక్కినేని సన్మానించారు.
ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ 'మా టీవీ వారు ముందు నాలుగైదు ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. 65 సంవత్సారాలు నటించాను. కనీసం 65 ఎపిసోడ్స అయినా ఉండాలని చెప్పాను. నాకు చాలా విషయాలు గుర్తున్నాయని తెలిపిన హాసం రాజాకు, మాటీవీ వారికి ముందుగా కృతజ్ఝతలు. ' దేవదాసు" సినిమా దాదాపుగా పూర్తయింది. 'మిస్సమ్మ" లో ఓ క్యారెక్లర్ గురించి చక్రపాణిగారు చెప్పారు. ఎవరు నటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో నా 'దేవదాసు" చిత్రం విడుదలైంది. ఆ తర్వాత నన్ను కలిసిన నిర్మాతలూ, దర్శకులందరూ తాగుబోతు సీన్స్ యాడ్ చేసిన కథలు వినిపించేవారు. నా ఇంటిపేరు 'అక్కినేని" ని 'తాగుబోతు" చేసేసి ఎక్కడ 'తాగుబోతు నాగేశ్వరరావు" అని పిలుస్తారేమోనని భయపడిపోయాను. సినిమాలో నటించాలని అవకాశాల కోసం పాకులాడలేదు. నా కెరీర్ లో వేషాల కోసం ఎవర్నీ ఎప్పుడూ అడగలేదు. ఒక్క మిస్సమ్మ చిత్రం తప్పు. నటుడన్నవాడు అన్నిరకాల పాత్రలూ పోషించాలి. అందుకే 'దేవదాసు" మంచి పేరు తీసుకొచ్చాక కూడా 'మిస్సమ్మ" లో హీరో కాని హీరో...కమెడియన్ కాని కమెడియన్ క్యారెక్టర్ పోషించాను. 'నాగేశ్వరరావు" డబ్బుకు అమ్ముడు పోయాడు. పిసినారోడు. ఎన్టీఆర్, చక్రపాణి నాగేశ్వరరావుని కొనేశారు. నాగేశ్వరరావు గొప్ప నటుడు అనుకుంటే వీడేంటి చిన్న నటుణ్ణి అని చెప్పుకుంటాడు" అంటూ అభిమానులు విమర్శించారు. ఇలా పత్రికల వాళ్లు ఎన్నో కథనాలు అల్లారు. ఇవన్నీ ఈ 'గుర్తుకొస్తున్నాయి" లో ఉన్నాయి. కొన్ని సినిమాల్లో నేనెందుకు నటించలేదు...కొన్ని సినిమాల్లో నేనెందుకు నటించానన్న సంగతులు కూడా ఉన్నాయన్నారు.


Click it and Unblock the Notifications











