‘అతడు ఒక విలన్’... స్టార్ హీరోపై సిద్ధార్థ్ సంచలన కామెంట్, ప్రధాని మోదీ ముందు అలాగేనా?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరో సిద్ధార్థ్ తన మనసులోని మాటను ట్విట్టర్లో నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. అలా చేయడం ద్వారా సిద్దార్థ్ చాలా సందర్భాల్లో విమర్శల పాలయ్యాడు. తాజాగా ఇండియాలో టాప్ హీరోగా వెలుగొందుతున్న అక్షయ్ కుమార్ గురించి సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
''అక్షయ్ కుమార్ ఒక విలన్... ఆయన్ను తక్కువగా అంచనా వేశాం'' అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ఇలాంటి కామెంట్ చేయడానికి కారణం ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీని అక్షయ్ ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన వీడియో బుధవారం ఉదయం విడుదలైంది. ‘దేశానికి ఒక సైనికుడిలా సేవ చేయాలనుకున్నాను, కానీ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను' అని మోదీ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికేనా?
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ అక్షయ్ కుమార్ మోదీని ఇంటర్వ్యూ చేయడం వెనక అసలు కారణం... మరోసారి ఆయన ప్రధాని అయ్యేలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికే అనే వాదన వినిపిస్తోంది. కోట్లాది మంది అభిమానులు ఉన్న అక్షయ్ లాంటి స్టార్ సపోర్ట్ ఉండటం వల్ల ఎన్నికల్లో కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతోనే దీన్ని ప్లాన్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్వీట్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేసిన సిద్ధార్థ్
‘అక్షయ్ కుమార్ ఒక విలన్... ఆయన్ను తక్కువగా అంచనా వేశాం' అంటూ ట్వీట్ చేయడం ద్వారా సిద్ధార్థ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారనే వాదన తెరపైకి వచ్చింది. మోదీని వ్యతిరేకించే వారంతా ఈ యంగ్ హీరో ట్వీట్‌ను సమర్ధిస్తున్నారు.

సోషల్ మీడియాలో వార్
మోదీని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేసిన వీడియో సోషల్ మీడియాలో... రెండు వర్గాల మధ్య పోట్లాటకు దారి తీసింది. కొందరు ఈ ఇంటర్వ్యూను సమర్ధిస్తుండగా, మరికొందరు ఇది ఎన్నికల జిమ్మిక్స్ అంటూ విమర్శిస్తున్నారు.

ప్రధాని ముందే కాలు మీద కాలేసుకుంటావా?
మరో వైపు ప్రధాని మోదీ ముందు అక్షయ్ కుమార్ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడాన్ని తప్పు బడుతూ... కొన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్రోల్స్ చేస్తున్న వారు అక్షయ్‌ను కావాలని టార్గెట్ చేస్తున్న మోదీ వ్యతిరేకులే అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











