నా కట్టె కాలేంత వరకు చిరంజీవి అభిమానినే.. మా నాన్నతోనే ఉంటానని భార్యకు చెప్పా.. అల్లు అర్జున్
జులాయితో ప్రారంభమైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తర్వాత ఎన్నో మంచి చిత్రాలు చేశారు. మధ్యలో వారితో నేను సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశాను. వారితో కలిసి నటిస్తోన్న మూడో సినిమా. చినబాబుగారు మా తప్పులను భరించారు. ఆయనకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. త్రివిక్రమ్‌గారి గురించి చెప్పాలంటే.. ఇంత మందిని కలిపి ఆనందం ఇచ్చేది డైరెక్టరే. మేం టూల్స్ అయితే. వాటిని ఉపయోగించుకునే వాడు డైరెక్టర్ మాత్రమే. అలాంటి త్రివిక్రమ్‌గారితో మూడో సారి కలిసి పనిచేశాను. ఆయనంటే అంత ఇష్టం. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే బలమైన కారణం ఆయన. నాకు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. నా ప్రతి ఇష్టాన్ని త్రివిక్రమ్‌గారు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఎంత చేసినా, ఎంత పేరు తెచ్చుకున్నా అది త్రివిక్రమ్‌గారి వల్లే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.

నాన్న గురించి స్టేజ్‌పై చెప్పలేదు
నాన్న గురించి నేను, నా గురించి నాన్న ఎప్పుడూ స్టేజ్‌పై చెప్పుకోలేదు. నన్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నే. సభాముఖంగా ఆయనకు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదు. కానీ ఈరోజు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ కేవలం నాతో సినిమా చేసినందుకే కాదు.. కొడుకు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. నేను మా నాన్నంత గొప్పగా ఎప్పుడూ కాలేను. ఆయనలో సగం కూడా కాలేను. నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్ కలుగుతుంది.

డబ్బుకు ఎప్పుడూ లోటు లేదు
మా నాన్నను నేను ప్రేమించినంతగా మరేవరినీ ప్రేమించను. నేను ఆర్య సినిమా చేసినప్పుడు అప్పట్లోనే కోటి రూపాయలు సంపాదించుకున్నాను. నాకు డబ్బుకు ఎప్పుడూ లోటు లేదు. అప్పటికీ పెళ్లైన తర్వాత నా భార్యను నేను అడిగింది ఒకే ఒకటి. నాకెన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటానని. మా నాన్నంటే అంత ఇష్టం. నేను చాలా మందిని చూసుంటాను. నేను చూసిన వారిలో ది బెస్ట్ పర్సన్ మానాన్నే.

45 ఏళ్లుగా నాన్న సినిమాలతో
పది రూపాయల వస్తువుని ఏడు రూపాయలకు బేరం చేసిన తర్వాత ఆరు రూపాయలు ఇవ్వండి అన్నా.. వాళ్లింటికి వెళ్లి ఏడు రూపాయలు ఇచ్చేసే వ్యక్తి మా నాన్నగారు. 45 ఏళ్లుగా ఓ వ్యక్తి సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మనిషిలో ప్యూరిటీ లేకపోతే మనిషి ఇవాళ సౌత్ ఇండియాలో, ఇండియాలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ క్రింద ఉండలేరు. మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్నగారికి కూడా పద్మశ్రీ రావాలనే కోరిక ఉండేది.

పద్మ శ్రీ ఇవ్వాలని ప్రభుత్వాలకు
మా నాన్న అల్లు అరవింద్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన అందుకు అర్హుడు. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా నా ఫ్యాన్స్ కారణంగానే నాకు ఈ గ్యాప్ వచ్చినట్లు అనిపించలేదు. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంది. నాకు చిరంజీవి గారంటే ప్రాణం.

ఎప్పుడూ చిరంజీవి అభిమానినే
నా కట్ట కాలేంత వరకు చిరంజీవిగారి అభిమానినే. చిరంజీవిగారి తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి రజినీకాంత్‌గారే. అలాంటి రజినీకాంత్‌గారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇష్టమైన డైరెక్టర్ మురుగదాస్‌గారు చేసిన సినిమా. ఈ సంక్రాంతికి ఆయన సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమాతో పాటు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా విడుదలవుతుంది. మహేశ్‌గారు సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి కల్యాణ్‌రామ్‌గారి ఎంతమంచివాడవురా సినిమా విడుదలవుతుంది. ఆయనకు కూడా అభినందనలు. ఈ సంక్రాంతి అందరికీ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.


Click it and Unblock the Notifications











