RRR సెట్‌లో హాలీవుడ్ నటుల హంగామ.. జంటగా ఫోజిచ్చిన ఫొటో వైరల్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు. ఇక, 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. అంతటి పేరున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నారు. ఇందులో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ జనవరి 8, 2021న విడుదల కానుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటులతో పాటు హాలీవుడ్ యాక్టర్లు కూడా నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా బ్రిటీష్ దొర అయిన స్కాట్‌గా రే స్టీవెన్‌సన్, లేడీ స్కాట్‌గా అలీసన్ డూడీ నటిస్తున్నారు. ఈ సినిమాలో వీళ్లిద్దరూ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ.. షూటింగ్ మాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్‌లో ఈ జంటపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సినిమాలో ఎంతో కీలకమైన పాత్రల కోసం రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ తమ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. నిర్విరామంగా సాగుతోన్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ జంటగా దిగిన ఫొటోను అలీసన్ డూడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్కాట్ అండ్ లేడీ స్కాట్ RRR సెట్‌లో ఉన్నామని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. దీనికి ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ స్పందిస్తూ 'ఓ మై గాడ్. ఈ ఫొటో చాలా క్యూట్‌గా ఉంది' అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











