రాజమౌళి సినిమా అంటే ప్రతీకారాలు: అల్లరి నరేష్
"వినాయక్ సినిమా అంటే సుమోలు, రాజమౌళి సినిమా అంటే ప్రతీకారాలు, నా సినిమా అంటే నవ్వులూ అని ప్రేక్షకులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారండీ" అంటున్నారు అల్లరి నరేష్. ఆయన నటించిన 'నువ్వా నేనా' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో ఇలా స్పందించారు. అలాగే...నా దగ్గరకు 'మగధీర'లాంటి కథతో వస్తే ఒప్పుకొంటాను. కాకపోతే చిన్న మార్పు... 'ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్.. ఒకేసారి వందమందిని పంపించు. మాంఛి భోజనం పెట్టి పంపిస్తా..' అనే డైలాగులు ఉంటే బాగుంటుంది. అక్కడ కూడా నా కామెడీ మిస్ అవ్వకూడదు. కథ ఎలాంటిదైనా బడ్జెట్‌ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొంటాను. నా మార్కెట్‌కీ పెట్టే పెట్టుబడికీ పొంతన ఉండాలి. కన్నీళ్లకు, కర్చీఫ్‌లకూ పని చెబితే ప్రేక్షకులకు నచ్చడం లేదు. అందుకే సరదాగా సాగిపోయే కథల్ని ఎంచుకొంటున్నా అని తేల్చి చెప్పారు. తన తాజా చిత్రం 'నువ్వా నేనా'కూడా ఆ తరహాలోనే సాగిపోతుంది అని చెప్పారు.
ఇక ఎప్పుడూ తాను వినోదాత్మక కథలనే ఎంచుకొంటాను అని చెప్తూ... తప్పదండి. ఎందుకంటే ఈనాటి ప్రేక్షకులు అవే కోరుకొంటున్నారు. ఈ రోజుల్లో నవ్విస్తామంటే ఎవరైనా వద్దంటారా? అందుకే అలాంటి కథలపై భరోసా పెంచుకోవడంలో తప్పులేదు అన్నారు. ఇక తమ బ్యానర్ లో సినిమా గురించి చెపుతూ.. నాన్నగారు స్థాపించిన ఈవీవీ సినిమా బ్యానరుపై సినిమా తీయాలని అనుకొంటున్నాం. ప్రస్తుతం నా సినిమాల సంఖ్య 40కి చేరుకొంది. 50వ సినిమా మా సంస్థలోనే చేయాలనే ఆలోచన ఉంది. అన్నయ్య ఆర్యన్ రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తారు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











