నాంపల్లి కోర్టులో అరవింద్ వాంగ్మూలం
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సినీ నటులు జీవిత, రాజశేఖర్ ఆరోపణలు చేయడంపై నిర్మాత అల్లు అరవింద్ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అల్లు అరవింద్ సోమవారం నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఆయన స్టేట్‌మెంటును న్యాయ స్థానం నమోదు చేసుకుంది. కేసు విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది.
చిరంజీవి డబ్బులకు రక్తాన్ని అమ్ముకుంటున్నారని జీవిత, రాజశేఖర్ ఆ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి మరీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో తీవ్ర వివాదం రేకెత్తింది. చిరంజీవి రాజకీయ జీవితంపై కూడా ఈ ఇద్దరు దంపతులు దుమ్మెత్తి పోశారు.
గతంలో సినిమా రంగంలో ఉన్నప్పుడు చిరంజీవికి, రాజశేఖర్ కి మధ్య విబేధాలు ఏర్పడటం, ఆ మధ్య ఒక సారి చిరంజీవి అభిమానులు రాజశేఖర్ కారుపై దాడి చేసిన నేపథ్యంలో విబేధాలు మరింత ముదిరి...ఇద్దరి మధ్య శతృత్వానికి దారి తీసినట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇంత జరిగినా చిరంజీవిదే పైచేయి కావడం గమనార్హం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై విచారణ జరిపిన ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు జరుగలేదని తేల్చి చెప్పడమే ఇందుకు నిదర్శనం.


Click it and Unblock the Notifications











