ప్రతి నిర్మాతా గుర్తించి, పాఠాలు నేర్చుకోవాలి: అల్లు అరవింద్
మూడు రోజుల క్రితం మృతి చెందిన సీనియర్ నిర్మాత కె.దేవీవరప్రసాద్ అంత్య దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన విషయాన్ని సంతాప సభలో సీనియర్ నిర్మాత, ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ గుర్తు చేసారు. తన కెరీర్‌లో తొంభై శాతం విజయాలు సాధించిన నిర్మాత పరిస్థితి ఇలా దారుణంగా మారిన సంగతిని ప్రతి నిర్మాతా గుర్తించి, పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు తమకు 'పర్యవేక్షక కమిటీ' వేస్తే బావుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నిర్మాతలంతా ఈ 'పర్యవేక్షక కమిటీ' కి నిబద్ధులై సినిమాలు తీయాల్సి ఉంటుంది. సినిమా నిర్మాణ వ్యయం దగ్గర నుంచి, తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, తారల కాల్షీట్లు, షూటింగ్ పని దినాల వరకు అన్ని విషయాలూ ఈ కమిటీ పర్యవేక్షణలో ఉంటాయని తెలుస్తోంది. దీనివల్ల నిర్మాణ వ్యయం, పారితోషికాలు అదుపులోకి వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు.
అలాగే అంతర్గత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. పరిశ్రమలో అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నది నిర్మాతేనని, అంతర్గత క్రమశిక్షణ లోపించడమే దీనికి కారణమని చాలామంది నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. సినిమా నిర్మాణంలోని ప్రతి అంశంలోనూ క్రమశిక్షణ పాటిస్తేనే కష్టాలు చాలా వరకు తీరుతాయని వారు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











