'జులాయి' స్టోరీ పాయింటేమిటంటే...: అల్లు అర్జున్
అల్లు అర్జున్ తాజా చిత్రం'జులాయి'. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం కథ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఒకే ఒక్క దెబ్బతో జీవితంలో స్థిరపడిపోవాలనుకొన్నాడు రవి. అందుకోసం తనకు నచ్చిన దారిలో వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెరపైనే చూడండి అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రెడీ అయిన 'జులాయి'లో ఇలియానా హీరోయిన్ గా చేసింది. ఎస్.రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
అలాగే... జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.
ఈ చిత్రం గురించి చిత్ర సమర్పకులు డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. యాక్షన్ అంశాలకు ప్రాధాన్యముంది. అల్లు అర్జున్ హుషారైన నటన చిత్రానికి బలాన్నిస్తుంది. త్రివిక్రమ్ సంభాషణలు, ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి. ప్రస్తుతం డీటీయస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో తెలుగు, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాము. ఆగస్టు 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం''అన్నారు.
అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి 'జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. ఎప్పటికప్పుడు నటుడిగా కొత్తదనం చూపించాల్సిందే. పాత్రల ఎంపికపరంగానూ జాగ్రత్తలు తీసుకొంటున్నాను. అందులో భాగంగానే సిక్స్ ప్యాక్ చేశాను. కేశాలంకరణలు మార్చాను. ఏం చేసినా... నా అభిమానుల్ని అలరించేలా అంశాలు ఉండేలా చూసుకొంటాను అన్నారు అల్లు అర్జున్. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











