'జులాయి'లో అల్లు అర్జున్ పాత్రేంటి?
అల్లు అర్జున్ త్వరలో 'జులాయి'గా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర గమ్మత్తుగా ఉంటుందంటున్నారు. త్రివిక్రమ్ ఈ పాత్రని ఫన్ తో ప్రత్యేకంగా డిజైన్ చేసారని తెలుస్తోంది. ఇక పాత్ర గురించి నిర్మాత ఎస్.రాధాకృష్ణ ఏమంటున్నారంటే...బాగా చదివితే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే జీతం వస్తుంది. ఆ తరవాత పదవీ విరమణ వయసొస్తుంది. అప్పుడు హాయిగా ఏ బెంగా లేకుండా జీవితాన్ని గడిపేయొచ్చు... ఇలా బీమా ప్రతినిధిలా మాట్లాడితే ఆ కుర్రాడికి నచ్చదు. టెన్షన్ లేకుండా బతకాలంటే పెన్షన్ వయసు రావక్కర్లేదు.. ఇప్పుడే ప్రతిక్షణం ఆస్వాదించండి అని హితబోధ చేస్తాడు. జీవితంపై ఆ యువకుడికున్న అభిప్రాయాలేంటో తెలుసుకోవాలంటే 'జులాయి' చూడాల్సిందే అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకుడు. ప్రస్తుతం దుబాయ్‌లో పాటల చిత్రీకరణ జరుపుకొంటోంది. అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి 'జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు.
అలాగే ''అర్జున్ శైలి నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ని నిర్మిస్తున్నాము. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా 'జులాయి' చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ఇప్పటికి నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫారిన్‌లో పాటలను చిత్రీకరిస్తాం. ఈ నెలాఖరున ఆడియోను, మే నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం''అన్నారు .
ఎప్పటికప్పుడు నటుడిగా కొత్తదనం చూపించాల్సిందే. పాత్రల ఎంపికపరంగానూ జాగ్రత్తలు తీసుకొంటున్నాను. అందులో భాగంగానే సిక్స్ ప్యాక్ చేశాను. కేశాలంకరణలు మార్చాను. ఏం చేసినా... నా అభిమానుల్ని అలరించేలా అంశాలు ఉండేలా చూసుకొంటాను అన్నారు అల్లు అర్జున్. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











