రుద్రమదేవి: అల్లు అర్జున్ పాత్రపై దర్శకుడి మాటల్లో...
హైదరాబాద్: రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్ర చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అర్జున్ పాత్ర గురించి ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ చెప్పిన వివరాలు....
'రుద్రమదేవి' లాంటి చారిత్రక సినిమాలు తీయాలంటే హైటెక్నికల్ వేల్యూస్ కన్నా....ముందు మంచి ఆర్టిస్టులు కావాలి. ఈ ప్రాజెక్టు చేసుకున్న అదృష్ణం కొద్దీ అనుష్క, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్,రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సుమన్, ఆదిత్య మీనన్, జయప్రకాష్ రెడ్డి, కేథరిన్ లాంటి హేమాహేమీలయిన ఆర్టిస్టులు దొరికారు.
అలాగే ఈ సినిమాలో అత్యంత కీలకమైన మరో పాత్ర ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకతీయుల చరిత్రలో రుద్రమదేవితో పాటు చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి గోనగన్నారెడ్డి. అప్పట్లో వర్ధమానపురంగా పిలవబడిన నేటి మహబూబ్ నగర్ జిల్లా వడ్డెమాన్ కి చెందిన ఈ వీరుడిగాథ చాలా ఆసక్తికరం.

ఓ బందిపోటుగా, రాబిన్ హుడ్ తరహాలో జనం కోసం రుద్రమదేవితోనే పోటాపోటీగా తలపడ్డ పాత్ర. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పాత్రకి ఎవరిని ఎంచుకోవాలా అని తర్జన భర్జన పడ్డాను. ధైర్య సాహసాలతో పాటు, ఎలాంటి సమస్యని అయినా, ఈజీగా గోయింగ్ గా ఫేస్ చేసే ఓ యూత్ ఫుల్ వారియర్ క్యారెక్టర్ ఇది.
స్పెషల్ అప్పియరెన్స్ అయినా...సినిమా చూసాక రుద్రమదేవితో పాటు వెంటాడే అద్భుతమైన పాత్ర. చివరికి నా ఊహలో ఎలా ఉంటే ఈ పాత్ర బాగుంటుందని ఆశించానో, అలాంటి అద్భుతమైన ఆర్టిస్ట్, యూత్ ఐకాన్ ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చారు. తను మరెవరో కాదు బాక్సాఫీసులో రేసుగుర్రంలా దూసుకెలుతున్న అల్లు అర్జున్.
'పల్నాటి బ్రహ్మానాయుడు' అంటే ఒకే ఒక్క...స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు, 'తెలినాలి రామకృష్ణుడు' అంటే తెలుగు సినిమా సమాంతర చరిత్ర...స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుగారు, 'తాండ్ర పాపారాయుడు' అంటే కృష్ణం రాజుగారు, 'అన్నమయ్య' అంటే నాగార్జున, 'అల్లురి సీతారామారజు' అంటే కృష్ణగారు....ఎలా మన గుండెల్లో గుర్తిండిపోయారో అలా 'గోనగన్నారెడ్డి' అంటే అల్లు అర్జున్ అని తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతాడు బన్నీ.
అల్లు అర్జున్ 'రుద్రమదేవి' సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర చేయడం ద్వారా ఈ జనరేషన్ హీరోలు కూడా ఇలాంటి చిత్రాలు చేయడానికి స్పూర్తిగా, నాందిగా నిలుస్తాడు. గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి అంగీకరించి, తెలుగు జాతి చరిత్రని, సంస్కృతిని గౌరవించిన బన్నీకి గతంలో నేను పడ్డ 'బకాయి'ని ఈ చిత్ర ఘన విజయం ద్వారా తీర్చుకుంటాను.
ఈ పాత్ర చాలా యూత్ ఫుల్‌గా...అంటే డిస్నీ సినిమాల్లో హీరో క్యారెక్టర్లు ఎంత అడ్వంచరస్‌గా, డైనమిక్‌గా, లవబుల్‌గా చిన్నా....పెద్దల్ని అలరిస్తాయో....ఆ తరహాలో ఈ గోనగన్నారెడ్డి పాత్ర ఉంటుంది. గోనగన్నారెడ్డి సరసన అనామికాదేవి పాత్రలో కేథరిన్ నటిస్తోంది. తీసుకున్నది చారిత్రక కథాంశమైనా, త్రీడీ టెక్నాలజీతో పాటు...యూత్ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా నటిస్తుండటతో ఈ సినిమా అందరికీ మరింత చేరువ అవుతుందని ఆశిస్తున్నాను. ఇప్పటికే అల్లు అర్జున్ ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి సాముల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. జులై నెలాఖరుకంతా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ 2014లోనే మీ ముందుకొస్తుందీ చిత్రం.
-ఇట్లు/గుణశేఖర్, నిర్మాత దర్శకుడు


Click it and Unblock the Notifications











