‘‘ బాంబే వాళ్లు బాంద్రాలోనే ఆగిపోయారు .. ఇప్పుడంతా తెలుగు సినిమాయే ’’
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలితో మొదలైన పాన్ ఇండియా కల్చర్ దాటికి బాలీవుడ్ కుయ్యో మొర్రో అంటోంది. మన జక్కన్న వేసిన బాటలో కేజీఎఫ్, కాంతారా, సలార్, కార్తీకేయ-2, హనుమాన్, పుష్ప, కల్కి 2898 ఏడీ వంటి దక్షిణాది చిత్రాలు హిందీ పరిశ్రమపై దండెత్తాయి. మన సినిమాలకు కనక వర్షం కురుస్తుండగా.. బాలీవుడ్ స్టార్ల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ పరిణామాలతో సౌత్ ఇండస్ట్రీపై ముఖ్యంగా టాలీవుడ్‌పై బాలీవుడ్ జనాలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు . అవేంటో ఒకసారి పరిశీలిస్తే :
మాస్ మసాలా, యాక్షన్ ఎలిమెంట్స్‌తో వచ్చే దక్షిణాది సినిమాలను హిందీ జనాలు ఆదరిస్తున్నారు. దీంతో ఏ కంటెంట్ సినిమా తీయాలా అని బాలీవుడ్ మేకర్స్ తలపట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ మూవీ అంటే టాలీవుడ్ అన్నంతగా తెలుగు సినిమా తన ముద్ర వేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్‌ని జోడించి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాలీవుడ్‌ను మరో మెట్టుపైకెక్కించింది.

భారతీయులు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, సూపర్ హీరోస్ వంటి సబ్జెక్ట్స్‌ని సరిగా డీల్ చేయలేరంటూ ఫారిన్ మేకర్స్ చేసిన మాటలకు తెలుగు సినిమా సమాధానం చెప్పింది. ప్రభాస్ సినిమా మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకోవడంపై హిందీ నటుడు అర్షద్ వార్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ను జోకర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి టాలీవుడ్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వెళ్లాయి. అటెన్షన్, పబ్లిసిటీ కోసమే అతను అలాంటి మాటలు అన్నాడంటూ నాని, దిల్‌రాజు, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి వాళ్లు మండిపడ్డారు. ప్రస్తుతానికి ఇష్యూ సద్దుమణిగినా తెలుగు సినిమాపై వాళ్లు రగిలిపోతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాల గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. రీసెంట్‌గా జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొన్న ఆయనను ఫిల్మ్ క్రిటిక్ మయాంక్ శేఖర్ ఇంటర్వ్యూ చేశారు. పాన్ ఇండియా సినిమాకు అసలైన నిర్వచనం ఏంటీ, 1990లలో చిరంజీవితో చేసిన ప్రతిబంధ్ పాన్ ఇండియా మూవీ కాదా అని శేఖర్ ప్రశ్నించగా.. దానికి అల్లు అరవింద్ స్పందించారు. పీవీ నరసింహారావు లాగా ఎవరైనా గేట్లు తెరవాలన్న ఆయన, ఇప్పుడు ఆ టైమ్ వచ్చిందన్నారు. దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలు భారతదేశమంతా ప్రాచుర్యం పొందుతున్నాయని అరవింద్ తెలిపారు.
తనకు బాంబే ఫిల్మ్ మేకర్స్‌పై గౌరవం ఉందని, కానీ వాళ్లు బాంద్రా, జుహూకే పరిమితమై పోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు ప్రాంతాల్లోనే బాలీవుడ్ మేకర్స్ పెరగడం వల్ల అలాంటి సినిమాలనే చేస్తున్నారని అరవింద్ చెప్పారు. తెలుగు, తమిళంలో చేసిన సినిమాలు యూపీ, బీహార్‌లలోనూ ఆదరణ దక్కుతోందన్నారు. ఇప్పుడు బాంబే జనాలు కూడా అలాంటి మూవీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అల్లు అరవింద్ తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని పరిశ్రమల నుంచి ఆల్ ఇండియా మూవీస్ వస్తాయని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై హిందీ జనాలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











