అల్లు అర్జున్ 'వరుడు' రిలీజ్ డేట్ ఫైనల్
"రెండు పాటలు, కొద్దిపాటి సన్నివేశాల్నీ తెరకెక్కించాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఆడియో, మార్చి 26న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"ని వరుడు చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు. అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ 'వరుడు' చిత్రం వేసవి కానుకగా రిలీజ్ చేయాలని మొదటి నుంచీ అనుకుంటున్నదే. అయితే దర్శక,నిర్మాతలు ఇప్పుడు అధికారికంగా ఈ డేట్ ని ప్రకటించారు.
అలాగే దర్శకుడు గుణశేఖర్ చిత్రం గురించి చెబుతూ "అల్లు అర్జున్ పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అతని నటన ఆకట్టుకుంటుంది. తమిళ నటుడు ఆర్య విలన్ పాత్ర పోషించారు. వీరిద్దరి మధ్య సాగే క్లైమాక్స్ సన్నివేశాలను ఇటీవల 15 రోజుల పాటు చిత్రించాం. స్టన్ శివ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరిగింది. సెంటిమెంట్, వినోదం, రొమాన్స్, యాక్షన్ అన్ని సమపాళ్ళలో మిళితమైన చిత్రమిది" అన్నారు.
ఇక ఈ చిత్రంలో చాలా భాగం ఓ వివాహం చుట్టూ తిరుగుతుందని సమాచారం. అలాగే ఈ చిత్రం కోసం నిజమైన వంద ఫ్యామలీలను ఎంపిక చేసి వారికి ఆరు నెలలు పాటు ట్రైనింగ్ ఇచ్చి మరీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో తాతగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్నారు. ఇక హీరో అల్లు అర్జున్ కు తల్లిగా ప్రముఖ నటి సుహాసిని తొలిసారిగా చేస్తోంది. కుటుంబ భావోద్వాగాలు, వినోదం కలగలపిన ఈ చిత్రం సమ్మర్ లో టాప్ గా నిలుస్తుందని ట్రేడ్ లో అప్పడే అంచనాలు మొదలయ్యాయి.
అందులో ఒక్కడు వంటి సూపర్ హిట్ మూవీ ని ఇచ్చిన గుణశేఖర్ దర్శకుడు కావటం ఈ చిత్రానికి మరో ప్లస్. అలాగే యూనివర్సల్ మీడియా పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆర్య-2 చిత్రం రిలీజై నెగిటివ్ ఫలితాన్ని బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. అల్లు అర్జున్ మరో దర్శకుడు క్రిష్ తో వేదం చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రం మిగతా పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ ప్రసాద్ తదితరులు నటించారు. సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్, కళ: అశోక్, కూర్పు: ఆంథోని.


Click it and Unblock the Notifications











