టిక్కెట్లే తెగడం లేదు, మెగా చెట్టుకింది మొక్కలం: బన్నీ
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ 'గౌరవం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న నేపథ్యంలో అభిమానులకు శిరీష్ ను పరిచయం చేసే కార్యక్రమం హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బన్నీ తన తమ్ముడు శిరీష్ గురించి మాట్లాడుతూ అభిమానులు అతన్ని కూడా ఆదరించాలని కోరారు.
అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ...'ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలుగా పరిచయం అవుతున్నారు. అందులో చాలా మందికి మార్నింగ్ షో టిక్కెట్లే తెగడం లేదు. కొంత మంది సినిమాలకు థియేటర్లకు ఎవరూ రావడం లేదు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇదంతా మెగా అభిమానుల ఆదరణ వల్లే. మీరు లేకుంటే మేము ఇంత ఎత్తుకు ఎదిగే వాళ్లమే కాదు' అన్నారు.
'డాడి సినిమాలో నాతో డాన్స్ చేయించి చిరంజీవి గారు ఆయన చేతుల మీదుగా నన్ను ఇండస్ట్రీలోకి పంపించారు. అదే విధంగా ప్రతిబంధ్ చిత్రంలో క్లైమాక్స్ లో బొకే పట్టుకుని వచ్చే బాల నటుడిగా శిరీష్ చిరంజీవిగారి చేతుల మీదుగా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. మేమంతా చిరంజీవి అనే చెట్టు కింద మొక్కలం. కానీ ఆ తేడా లేకుండా ఆయన లాగే మమ్మల్ని ఆదరిస్తున్నారు. అందుకే అభిమానుల ఆనందం కోసం ఏదైనా చేస్తాం. డాన్స్ ప్రాక్టీస్ చేసేప్పుడు చెయ్యి విరిగినా, వేలు విరిగినా అది మెగా అభిమానుల ఆనందం కోసమే. మెగా హీరోలంతా ఒక స్టెప్ వేస్తున్నాంటే అది అభిమానులను ఆనంద పరుస్తుందా లేదా అని ఆలోచిస్తారు. ఎవరి స్టైల్ వారిదే. ఎవరూ ఎవరినీ ఇమిటేట్ చేయరు. శిరీష్ చాలా తెలివైన వాడు. మేము ఎవరూ వెళ్లని కొత్త జోనర్ లోకి వెలుతున్నాడు. మా తాతగారి, చిరంజీవిగారి గౌరవం నిలబెడతాడనే నమ్మకం ఉంది' అన్నారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ.... 'హీరో కావాలంటే ఎంత కష్ట పడలాలో మా ఫ్యామిలీలోని హీరోలని చూసి తెలుసుకున్నాను. ఇలాంటి ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నటుడిగా మంచి మార్కులు పొందుతాననే నమ్మకం ఉంది. నెక్ట్స్ సినిమా మాత్రం కమర్షియల్ అంశాలతో ఉంటుంది. మెగా ఫ్యామిలీలో అన్ని రకాల హీరోలు ఉన్నారని నిరూపిస్తాం' అన్నారు.


Click it and Unblock the Notifications











