లవ్, క్రైమ్, కొద్దిగా ఫీల్..(‘జులాయి’ ప్రివ్యూ)
హైదరాబాద్ : అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'జులాయి'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ రవి అనే పాత్రలోనూ,ఇలియానా మధు అనే పాత్రలో హైటెక్ ఇంజినీర్ గా కనిపించనుంది. రవి పక్కా జులాయి టైప్ క్యారెక్టర్. అతను..మధు తో పీకలోతు ప్రేమలో పడిపోయి,ప్రేమ గీతాలు పాడుతూంటాడు. మధు కూడా రవితో ఓ టైమ్ కి ప్రేమలో పడుతుంది. మరో ప్రక్క రవిని చంపటానికి ఓ గ్యాంగ్ వెతుకుతూ ఉంటుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఎవరా గ్యాంగ్..అసలు మధు ఎవరు...రవి జీవితంలోకి ఆమె రావటానికి కారణం ఏమిటి...ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
ఈ చిత్రం గురించి దర్శకుడుత్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...ఈతరం అబ్బాయిలకు ఓ పద్ధతంటూ ఉంది. 'ఇది తప్పు..' అని ముద్రపడిన ప్రతి విషయాన్నీ రుచి చూస్తారు. కానీ వారి హద్దుల్లోనే ఉంటుంటారు. రోజుకి నాలుగు సిగరెట్లు మాత్రమే తాగుతారు. ఎందుకంటే ఐదోది కొనలేక. సెకండ్ షో చూశాక నేరుగా ఇంటికొచ్చేస్తారు.. ఎందుకంటే ఆ తరవాత బయట తిరగలేక. ఇలాంటి వారినే 'జులాయి' అంటుంటారు. ఈ లక్షణాలన్నీ అక్షరాలా పుణికిపుచ్చుకొన్న రవి అనే అల్లరి అబ్బాయి కథ ఇది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ...పని, పాట లేకుండా తిరిగేవాడ్ని పెద్దలు 'జులాయి' అంటుంటారు. ఆ పెద్దలే... మగాడు తిరక్క చెడతాడు... ఆడది తిరిగి చెడుతుంది అని సూక్తులు వల్లిస్తుంటారు. వీటిల్లో ఏది కరెక్ట్? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలాకష్టం. అందుకే ఆ పెద్దల తిట్లను కూడా ఆశీర్వాదాలుగా తీసుకుంటుంటాడు ఓ కుర్రాడు. వాళ్లు 'వెధవ' అన్నా... 'వెయ్యేళ్లు ధనముతో వర్థిల్లు' అని దీవించినంత ఆనందపడిపోతాడు. అలాంటి కుర్రాడికి ఓ కుర్రది తారసపడితే... ఇక ఆ సందడికి హద్దు ఉంటుందా... మా 'జులాయి' సినిమా నడక ఇలాగే ఉంటుంది అన్నారు.
బ్యానర్ : హారిక అండ్ హాసిని క్రియేషన్స్.
నటీనటులు: అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్రప్రసాద్, సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు.
సంగీతం : దేవిశ్రీప్రసాద్
కెమెరా : ఛోటా కె.నాయుడు,శ్యామ్ కె.నాయుడు
ఆర్ట్: రవీందర్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
కథ,మాటలు,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత :ఎస్.రాధాకృష్ణ
విడుదల తేదీ: 2012/08/09


Click it and Unblock the Notifications











