2 నెలల్లో ఫినిష్ : అల్లు అర్జున్-పూరి మూవీ రిలీజ్ డేట్ ఖరారు
'దేశ ముదురు' లాంటి హిట్ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బన్నీ సరసన శృతి హాసన్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు.
తన సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉండే పూరి జగన్నాథ్ తాజాగా ఈ చిత్రం విషయంలో కూడా ముందే ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న మొదలు పెట్టి 65 రోజుల్లో స్పీడ్‌గా షూటింగ్ కానిచ్చేసి డిసెంబర్ 21న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తమన్నా హీరోయిన్. పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్న ఈచిత్రం షూటింగ్ జూన్ 15న మొదలైన త్వరిత గతిన జరుగుతోంది. అక్టోబర్ 18న ఈచిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'జులాయి' చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కె. రాధకృష్ణ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బన్నీ సరసన ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











