అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవగా.. కరోనా కారణంగా పలుమార్లు దీనికి ఆటంకం ఏర్పడింది. అయితే, ఇటీవల తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ మరోసారి ప్రారంభమైంది. ఏకధాటిగా సాగుతోన్న షూటింగ్‌లో చిత్ర హీరో అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్.
సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో.. ప్రస్తుతం పట్టాలపై ఉన్న ప్రాజెక్టుల రిలీజ్ డేట్లు ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కొత్త సినిమా విడుదల తేదీని కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఈ మేరకు 10.35 గంటలకు ఓ సర్‌ప్రైజ్ రాబోతుందని గురువారం ఉదయమే చిత్ర యూనిట్ వెల్లడించింది. అందుకు అనుగుణంగానే అదే సమయానికి 'పుష్ప' నుంచి రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆగస్టు 13, 2021న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అందులో వెల్లడించారు.

ఇక, ఈ పోస్టర్‌లో అడవిలో పని చేసే కూలీలందరూ గొడ్డళ్లను పట్టుకుని కనిపించారు. వాళ్లకు అల్లు అర్జున్ అలియాస్ పుష్ప నాయక్ నాయకుడిగా కనిపిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా... ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను పది భాషల్లో విడుదల చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనే విడుదల చేస్తున్నట్లు ఆ పోస్టర్‌లో చూపించారు. దీంతో ఒకే అప్‌డేట్‌లో రెండు విషయాలపై స్పష్టతనిచ్చింది చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











