అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’ ఫస్ట్ లుక్ (వీడియో)
హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తాజాగా ఈ రోజు విడుదల చేసారు. ఈ రోజు దర్శకుడు సురేంద్ర రెడ్డి పుట్టిన రోజు కావడం విశేషం. ఫిబ్రవరిలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
'రేస్ గుర్రం'లో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్, యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే "గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అంటూ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు.
సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.
ఫోటోపై క్లిక్ చేసి టీజర్ వీడియో వీక్షించండి
కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బన్నీ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉండనుందని, కథా కథనాల పరంగా సురేందర్‌రెడ్డి గత చిత్రాలను మించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో 'కిక్'శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇద్దరికీ ఈ సినిమా విజయం కెరీర్ పరంగా ఎంతో కీలకం.
ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications












