Pushpa Thank You Meet సుకుమార్‌ను కంటతడి పెట్టించిన అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ కూడా ఏడుస్తూ ఎమోషనల్
దేశవ్యాప్తంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప చిత్రం ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఈ చిత్రం 300 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలో పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్, సీఈవో చెర్రీ హైదరాబాద్‌లో థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, చంద్రబోస్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఐకాన్ స్టార్ మాట్లాడుతుండగా సుకుమార్ కంటతడి పెట్టుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

నా వెనుక 350 మంది కృషి
పుష్ప సినిమా పోస్టర్‌లో నన్నే చూస్తారు. కానీ నా వెనుక ఎంత మంది కష్టం ఉంటుందో తెలియదు. దాదాపు 350 మంది పనిచేస్తారు. వాళ్లందరికి థ్యాంక్స్ చెప్పే అవకాశం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కష్టం. కానీ వారందరికి థ్యాంక్స్ చెప్పడం అవసరం. ఎందుకంటే మా జీవితం. కొన్నిసార్లు థ్యాంక్స్ చెప్పే అవకాశం రాదు. కానీ ఇక నుంచి సినిమా సక్సెస్ అయినా కాకపోయినా సినిమాలో పనిచేసిన వారందరికి థ్యాంక్యూ చెప్పుకోవడానికి ఓ మీటింగ్ ఉంటుంది. అదే థ్యాంక్యూ మీట్ అని అల్లు అర్జున్ చెప్పారు.

రష్మికతో నాకు బెటర్ కంఫర్ట్
హీరోయిన్ రష్మిక మందన్నకు థ్యాంక్స్ చెబుతూ.. పాప నేను నీకు నచ్చావా? అంటూ కామెంట్ చేస్తూ.. నా పక్కన నటించిన హీరోయిన్ల అందరిలో నీవు స్పెషల్. ఒక సీన్‌లో చేసేటప్పుడు హీరోయిన్, హీరో మధ్య కంఫర్ట్ ఉండాలి. ఆ కంఫర్ట్ హీరోయిన్ నుంచే వస్తే సీన్ పండుతుంది. హీరో ఆ కంఫర్ట్‌ను తీసుకోలేం. ప్రతీ సీన్ బాగా పండటానికి రష్మిక పెర్ఫార్మెన్స్, సపోర్ట్ నాకు బాగా హెల్ప్ అయింది. అందుకే నేను తెర మీద అద్భుతంగా నటించానని అందరూ చెప్పుకొంటున్నారు అని అల్లు అర్జున్ చెప్పారు.

దేవీ శ్రీ ప్రసాద్‌తో చిన్నప్పటి నుంచే
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు థ్యాంక్స్ చెబుతూ.. డీఎస్పీతో అనుబంధం నా చిన్నతనం నుంచి ఉంది. చిరంజీవి గారు.. ఓ అబ్బాయి బాగా మ్యూజిక్ చేస్తున్నారు అని చెబితే.. దేవీ ఇంటికి వెళ్లి వాయిలిన్ వాయించాం. ఆనందం సినిమా చేసిన తర్వాత నాకు చాలా హ్యపీగా ఫీలయ్యా. ఆ తర్వాత ఆర్యతో నా ప్రయాణం మొదలైంది. గుప్పెడంత ప్రేమ అందరికి ఇష్టమని చెబుతుంటే.. ప్రతీ పాట వెనుక నీవు పడే తపన నాకు కనిపిస్తుంది అని అల్లు అర్జున్ అన్నారు.

సుకుమార్‌తో నా ప్రయాణం అంటూ
ఇక దర్శకుడు సుకుమార్ గురించి మాట్లాడుతూ.. సుకుమార్ గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. అలాగే నా గురించి సుకుమార్ బహిరంగంగా చెప్పలేడు. కానీ నేను సుకుమార్ గురించి నా మనసులో మాట చెప్పాల్సిందే. సుకుమార్ లేకపోతే ఒకలా.. ఉంటే మరోలా ఉంటుంది. ఎవరైనా 18 ఏళ్ల వయసులో కెరీర్ ఎంచుకొనే సమయంలో తీసుకొనే డిసిషన్ జీవితాన్ని మార్చేస్తుంది. ఆర్య సినిమా చేసేటప్పుడు సుకుమార్‌తో కలవడం నా జీవితంలో తీసుకొన్న మంచి నిర్ణయం. ఆ నిర్ణయమే ఐకాన్ స్టార్ వరకు తీసుకొచ్చింది అని అల్లు అర్జున్ అన్నారు.

నేను రుణపడి ఉన్న వారు ఎవరంటే..
నా జీవితంలో కొంతమందికే నేను రుణపడి ఉంటాను. మాకు సినీ జీవితాన్ని ప్రసాదించిన అల్లు రామలింగయకు రుణపడి ఉంటాను. రైతుగా పనిచేసుకొనే ఆయన సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలని నిర్ణయం తీసుకోకపోతే మేము ఉండం. మా తాతయ్యకు, నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. అలాగే నా మొదటి సినిమా నుంచి సపోర్ట్ చేస్తున్న చిరంజీవి గారికి రుణపడి ఉంటాను. ఆ తర్వాత నేను అంతగా ఇష్టపడేది సుకుమార్ గురించి మాత్రమే అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

సుక్కు డార్లింగ్ నీవు లేకపోతే నేను లేను
సుకుమార్‌తో సినిమా చేసిన తర్వాత పరుగు అనే సినిమా చేస్తున్నాను. ఆ టైమ్‌లో 80 లక్షలు పెట్టి స్పోర్ట్స్ కారు కొన్నాను. ఆ కారు స్టీరింగ్‌పై చేయిపెట్టినప్పుడు.. నేను ఇంత వరకు వచ్చానంటే.. ఈ రేంజ్‌కు ఎదిగానంటే కారణం ఎవరని ఆలోచించా. అప్పుడు మొదటగా గుర్తు వచ్చింది సుకుమార్ గారే.. డార్లింగ్ నీవు లేకపోతే నేను లేను అంటూ అనగానే సుకుమార్ లేచి కంట తడి పెట్టుకొన్నారు. కళ్లలో ఉబికి వస్తున్న నీళ్లను తుడుచుకోవడం చూసి అల్లు అర్జున్ కూడా వేదిక మీద ఏడ్చేశాడు. దాంతో వేదిక వద్ద ఉన్న ప్రతీ ఒక్కరు ఎమోషనల్ అయ్యారు.

నన్ను ఐకాన్ స్టార్ చేశావు అంటూ
అల్లు అర్జున్ వేదిక మీద కంటతడి పెట్టుకొంటూ.. ఛీ ఛీ ప్రతీసారి వేదిక మీద ఇలా ఏడవడం ఏంటి.. అల వైకుంఠపురంలో సక్సెస్ మీట్‌లో మా నాన్న గురించి ఏడ్చాను. ఇక ముందు ఇలా ఎమోషనల్ కావొద్దు. థ్యాంక్యూ సుకుమార్ డార్లింగ్. నన్ను స్టార్ చేసి.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ చేశాడు. నీవు నాకు ఎంత ముఖ్యమో తెలుసుకో. నీవు లేకపోతే ఆర్య లేదు.. పుష్ప లేదు అని అల్లు అర్జున్ అన్నారు.


Click it and Unblock the Notifications











