శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్.. పోలీసుల అంక్షల మధ్య హాస్పిటల్ సందర్శనకు ఐకాన్ స్టార్
పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ వివాదాస్పద ఘటన సందర్భంగా కేసు నమోదు కావడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి అడ్డు ఏర్పడటంతో ఆలస్యంగా ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు. పోలీసుల ముందుస్తు అనుమతితో ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించడానికి వచ్చారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పుష్ప 2 వివాదాస్పద సంఘటనలు గత ఐదు వారాలుగా అల్లు అర్జున్ వెంటాడుతున్నాయి. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించి ఓ మహిళ మృతికి, ఓ చిన్నారి తీవ్రంగా గాయపడటానికి కారణమయ్యారనే ఆరోపణలపై చిక్కడ పెళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో హై కోర్టు నుంచి బెయిల్ రావడంతో ఆయన ఓ రోజు తర్వాత విడుదల అయ్యారు. ఇటీవల ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ కూడా లభించడం తెలిసిందే.

అయితే పూర్తిస్థాయి బెయిల్ వచ్చిన తర్వాత శ్రీతేజ్‌ను పరామర్శించాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ మేరకు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన హాస్పిటల్ సందర్శనకు వెసులుబాటు కలిగింది. అయితే అల్లు అర్జున్ హాస్పిటల్‌ను సందర్శించే సమయంలో మీడియాకు సమాచారం ఇవ్వకూడదు. ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వాలి. దాంతో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ చర్యలు తీసుకొంటామని పోలీసులు వెల్లడించినట్టు సమాచారం. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్ సందర్శించినట్టయితే ఏదైనా జరిగితే అల్లు అర్జున్ టీమ్ బాధ్యత వహించాలని సూచించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.
దాంతో పోలీసులకు ముందు సమాచారం ఇవ్వడంతో ఆయనకు సందర్శనకు సెక్యూరిటీ, తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. మీడియా ఆర్బాటానికి తావివ్వకుండా అల్లు అర్జున్ గుట్టు చప్పుడు కాకుండా హాస్పిటల్‌ను సందర్శించారు. శ్రీతేజ్‌ను కలిసి కుశల ప్రశ్నలు వేసినట్టు సమాచారం. ఆ తర్వాత మీడియాతో మాట్లాడకుండా నేరు వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ వ్యవహారం గురించి ఆయన టీమ్ ఏదైనా అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.
అల్లు అర్జున్ హాస్పిటల్‌కు వస్తున్నట్టు కేవలం వైద్యులకు, బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో ఎలాంటి హంగామా కనిపించలేదు. సాధారణ పరిస్థితుల మధ్య అల్లు అర్జున్ హాస్పిటల్‌లోకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











