అల్లు శిరీష్ ‘గౌరవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే
ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రెండవ కొడుకు శిరీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్' లోనూ హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం... ఈ చిత్రంలో మెగా అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయి అని దర్శకుడు చెప్తున్నారు.
దర్శకుడు రాధామోహన్ మాట్లాడుతూ... ఒక మంచి కథకి, మంచి నటీనటులు సమకూరితే ఆ చిత్రం ఎలా ఉంటుందో మా గౌరవం కూడా అదే రేంజిలో ఉండబోతోంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే హైలెట్‌గా నిలవబోతోంది. మేము ఎంచుకున్న కాన్సెప్ట్ గౌరవం చిత్రానికి బాగా ప్లస్సవుతుంది. అల్లు శిరీష్, యామి గౌతమ్, ప్రకాష్ రాజ్, నాజర్ వారి పాత్రల్లో ఇమిడిపోయారు. తమన్ సంగీతం వైవిద్యంగా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
ప్రేమ, సెంటిమెంట్, వినోదం కలిసిన ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని నవ హీరో అల్లు శిరీష్ అంటున్నారు. ఈ చిత్రం కచ్చితంగా విజయాన్ని ఇస్తుందని అల్లు శిరీష్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను ప్రకాష్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications












