Amala Paul: అమలా పాల్ కు లైంగిక వేధింపులు.. ఆ వీడియోలు బయట పెడతానంటూ
లవ్ ఫెయిల్యూర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల వద్ద గుర్తింపు పొందింది కేరళ బ్యూటీ అమలా పాల్. అనంతరం రామ్ చరణ్ సరసన నాయక్ సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అయినా తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి. ఇక ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్‌తో మంచి పాపులారిటీ వచ్చింది. ప్రస్తుంత నటిగా, నిర్మాతగా వరుస సినిమాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మాజీ ప్రియుడు భవీందర్ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అమలా పాల్.

మోసం చేశాడని..
తెలుగులో కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న అమలా పాల్ ఇటీవల కడావర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే తాజాగా అమలా పాల్ పోలీసులను ఆశ్రయించింది. తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్ తనను మోసం చేశాడని, లైంగికంగా వేధించి, బెదిరించాడని తమిళనాడులోని విల్లుపురం జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయట పెడతాని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

ప్రైవెట్ వీడియోలు బయట పెడతానని..
అయితే భవీందర్తోపాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసింది అమలా పాల్. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భవీందర్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. మిగతా 11 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా 2018లో అమలా పాల్, సింగర్ భవీందర సింగ్ సంయుక్తంగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ సమంయలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి స్నేహితులయ్యారు. అది కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అనంతరం పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ నిర్మాణ సంస్థ లావాదేవీల్లో విబేధాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకపోగా, డబ్బు అడిగితే ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని అమలా పాల్ ఫిర్యాదులో పేర్కొంది.

విడాకులతో వార్తల్లో..
అతనితోపాటు భవీందర్ సింగ్ 11 మంది స్నేహితులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. కాగా కేరళ బ్యూటీ అయిన అమలా పాల్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది. లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరు అమ్మాయిలతో, జెండాపై కపిరాజు వంటి సినిమాల్లో నటించిన అమలా పాల్ ఆ మధ్య విడాకులతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇక ఇటీవల సింగర్ భవీందర్ సింగ్‌తో ప్రేమలో ఉన్నట్లు, అతనితో పెళ్లి కూడా జరిగిందని వార్తలు వినిపించాయి.


Click it and Unblock the Notifications











