Ram Charan Amit Shah: రామ్ చరణ్ ను సత్కరించిన అమిత్ షా.. ఇద్దరు దిగ్గజాలు అంటూ ట్వీట్!
తెలుగు చిత్రీసీమ దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మూవీ RRR (రౌద్రం రణం రుధిరం) తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు దాటి అశేష ప్రేక్షక లోకం కొనియాడేలా చేసింది. గతేడాది విడుదలైన ఈ సినిమా అవార్డులతో సునామీ సృష్టించింది.
గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్, హెచ్సీఏ అవార్డులతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారాన్ని సాధించి యావత్ భారతదేశం గర్వపడేలా చేసింది. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా సన్మానించారు.

అశేష అభిమానగనం..
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో అలరించి అశేష అభిమానగనాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆయన నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి మెగా పవర్ స్టార్ అయ్యాడు. గతేడాది విడుదలైన RRR సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

ఆస్కార్ రావడంతో..
RRRలో రామ్ చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కొనియాడటమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. దీంతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు చెర్రీ. ఆ తర్వాత చిరు-చెర్రీ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య మాత్రం పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.. ఇటీవల RRR సినిమాకు ఆస్కార్ రావడంతో రామ్ చరణ్ పేరు మరోసారి మారుమోగిపోయింది. ఈ క్రమంలో చెర్రీని సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు.

శాలువ కప్పి సత్కరించి..
తాజాగా రామ్ చరణ్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కొనియాడి సన్మానించారు. ఆస్కార్ అనంతరం అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కేంద్ర మంత్రులను కలిశారు. ఈ క్రమంలోనే హోమ్ మంత్రి అనిత్ షాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోపాటు మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఈ సందర్భంగానే రామ్ చరణ్ కు శాలువ కప్పి సత్కరించారు అమిత్ షా.

మీ మాటలు ఎంతో స్ఫూర్తిగా..
చెర్రీని అమిత్ షా శాలువాతో సత్కరించగా.. ఆయన్ను మెగాస్టార్ చిరంజీవి శాలువ కప్పి సత్కరించారు. అమిత్ షాకు రామ్ చరణ్ పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షాకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. "అమిత్ జీ.. మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ విజయం RRR టీమ్ అందరిది. ఈ గుర్తింపు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమది. ఈ ఆస్కార్ భారత దేశ ప్రజలందరికీ లభించిన గౌరవం. భవిష్యత్తులో భారతీయ చిత్ర పరిశ్రమ చేసే కృషికి మీ మాటలు ఎంతో స్ఫూర్తినిస్తాయి" అని చిరంజీవీ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ ప్రభావితం..
అలాగే "భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్ లను కలవడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ సొంత చేసుకోవడంతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు రామ్ చరణ్ ను అభినందించాను" అని అమిత్ షా ట్వీట్ చేశారు.

సాంప్రదాయానికి చిహ్నమైన..
"ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో గౌరవనీయులైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారిని కలవడం ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందం చేసిన కృషిని అభినందించినందుకు థ్యాంక్యూ సార్" అని చెర్రీ తెలిపాడు. ఇదిలా ఉంటే శుక్రవారం ఢిల్లీలో మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కూడా చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయానికి చిహ్నమైన టోపీ, శాలువాతో చిరంజీవిని అనురాగ్ ఠాకూర్ సత్కరించారు.


Click it and Unblock the Notifications











