అమితాబ్‌కు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని ప్రకటించింది . 2011 సంవత్సరానికిగాను ఈ అవార్డుని అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే మూడు జాతీయ పురస్కారాలు, ఒక రాష్ట్ర పురస్కారాన్నీ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రకటించారు.
బి.ఎన్.రెడ్డి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని దర్శకులకు అందజేస్తారు. ఈసారి ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్‌ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. సినీ పరిశ్రమకు సేవలందించిన సినీ నిర్మాతలకు నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందిస్తారు. అందుకుగాను పద్మాలయా స్డూడియోస్ అధిపతి, నిర్మాత జి.ఆదిశేషగిరిరావుకి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు.
రఘుపతి వెంకయ్య అవార్డుని ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణకు ప్రకటించారు. ఎన్టీఆర్ అవార్డుకిగానూ రూ.5 లక్షలు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. మిగిలిన పురస్కారాలకు రూ.2 లక్షలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని బహూకరిస్తారు.
ఉగాది పర్వదినాన నిర్వహించే నంది పురస్కారాల ప్రదాన వేదికపైనే ఈ అవార్డులనీ అందజేస్తారు. తమ్మారెడ్డి భరద్వాజ, కేసీ శేఖర్‌బాబు, ఎమ్.బాలయ్యలతో కూడిన కమిటీ పురస్కారగ్రహీతలను ఎంపిక చేసింది.


Click it and Unblock the Notifications












