ఏఎన్ఆర్ పురస్కారం: హైదాబాద్‌లో అమితాబ్ సందడి
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నాగార్జున ఆయన్ను గ్రాండ్‌గా రిసీవ్ చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఆయన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అందుకోబోతున్నారు. అంతకు ముందు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు.
ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్-2014 పురస్కారానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఎంపికయిన సంగతి తెలిసిందే. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డు ప్రధానోత్సవం జరుగనుంది.

ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1991లో అక్కినేనిని వరించింది. తన జీవితకాలంలోనే అలాటి మరొక అవార్డును నెలకొల్పాలని అక్కినేని సంకల్పించారు. అన్నపూర్ణా స్టూడియోస్ ఆధ్వర్యంలో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ 2005లో అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఎఎన్ఆర్ నేషనల్ అవార్డును నెలకొల్పింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు యావజ్జీవితం సేవ చేసిన, అసాధారణ విజయాలు సాధించిన వారికి ప్రతి ఏటా ఈ అవార్డును బహూక రిస్తున్నారు. మెమొంటో, పతకంతో పాటు ప్రారంభంలో అవార్డు గ్రహీతలకు అందించిన రూ. 3 లక్షల నగదు పురస్కరాన్ని తర్వాత 4 లక్షలకు, ప్రస్తుతం 5 లక్షల రూపాయలకు పెంచారు.
ఇప్పటి వరకు ఈ అవార్డులను పలువురు ప్రముఖులకు ప్రకటించారు. 2005లో నటుడు, రచయిత, దర్శకుడైన దేవానంద్, 2006 నటి షబానా ఆజ్మీ, 2007లో నటి, నిర్మాత అంజలీ దేవి, 2008లో నటి, నర్తకి, గాయని, కొరియోగ్రాఫర్ వైజయంతి బాలి, 2009లో నేపథ్యగాయని లతా మంగేష్కర్, 2010లో దర్శకుడు కె. బాలచందర్, 2011 నటి, దర్శకురాలు హేమమాలిని, 2012లో రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్, 2013లో నటి శ్రీదేవి ఈ అవార్డు అందుకున్నారు.


Click it and Unblock the Notifications